హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14(విజయక్రాంతి) : హైదరాబాద్ మెట్రో రైళ్లు మంగళవారం ప్రయాణీకులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, అమీర్‌పేట, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులు భారీగా కనిపించారు. టికెట్ల కోసం కూడా భారీ క్యూలు కనిపించాయి. శనివారం, ఆదివారంతో పాటు సోమవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉండడం వల్ల వరుస సెలవు రావడంతో నగరంలో నివాసముండే వివిధ జిల్లాలకు చెందిన వారు పల్లెబాట పట్టిన విషయం తెలిసిందే.
సెలవులు ముగియడంతో సొంత ఊళ్లకు వెళ్లినవారు తిరిగి నగరబాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా నగరానికి వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్లడానికి మెట్రోలో ప్రయాణించడానికే మొగ్గుచూపడంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో యాజమాన్యం మంగళవారం ఉదయం ఐదున్నర నుంచే మెట్రో సర్వీసులను ప్రారంభించింది. మెట్రోలో సాధారణంగా ప్రతిరోజూ దాదాపు 4.80 లక్షల మంది ప్రయాణిస్తారు. కానీ సోమవారం ప్రయాణికుల రద్దీకి తోడు మెట్రో యాజమాన్యం సర్వీసులను పెంచడంతో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు
నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం(08590).. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్(08589) వరకు స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు బుధవారం వరకు అందుబాటులో ఉంటాయి.
మూడు రోజుల్లో రెండు వేల బస్సులు
వరుస సెలవులకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకోవడంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకుల రద్దీ మంగళవారం కొనసాగింది. రద్దీ నేపథ్యంలో మూడు రోజులుగా హైదరాబాద్ నుంచి విజయవాడ, కరీంనగర్, వరంగల్ రూట్‌లలో రెండు వేల బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కేవలం ఆర్టీసీ బస్సులలోనే లక్షమందికిపైగా ప్రయాణించారని పేర్కొన్నారు. ఆదాయం పట్ల ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
ఏపీ టు హైదరాబాద్ కొనసాగుతున్న రద్దీ
పోలింగ్‌కు వెళ్లిన ఓటర్ల తిరుగు ప్రయాణం
యాదాద్రి భువనగిరి, మే 14 (విజయక్రాంతి) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరుగు ప్రయాణాల ప్రభావంతో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీతో పాటు పలు తెలంగాణ జిల్లాలకు చెందిన నగర వాసులు మంగళవారం తిరిగి నగరానికి బయలు దేరిన కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దీంతో పంతంగి టోల్‌ప్లాజాతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుండగా పోలీసులు క్రమబద్దీకరించి పంపిస్తున్నారు.