గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మంత్రి సీతక్క విజ్ఞప్తి
జైనూర్ పరిస్థితులను నివేదించిన మంత్రి
ఆదిలాబాద్‌లో పర్యటనకు గవర్నర్ సానుకూల స్పందన
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించేలా చొరవ చూపాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కోరారు.
మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సీతక్క రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై వినతిపత్రం అందజేశారు. ములుగు ను మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందని, సాంకేతిక సమస్యలతో ఇప్పటికీ ములుగు మున్సిపాలిటీకి నోచుకోలేదని వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ చట్ట సవరణల బిల్లులో భాగంగా జీహెచ్‌ఎంసీలో కోఆప్షన్ సభ్యుల సంఖ్యను 5 నుంచి 9కి, మైనార్టీ కోఆప్షన్ సభ్యుల సంఖ్యను 2 నుంచి 5కు పెంచుతూ చట్ట సవరణ చేశారని వివరించారు. అదే బిల్లులోనే ములుగు మున్సి పాలిటీ అంశాన్ని చేర్చడంతో దానికి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలుపలేదని, ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి బిల్లును పంపించారని గుర్తుచేశారు.
దీంతో అప్పటి నుంచి బిల్లు పెండింగ్‌లోనే ఉందిపోయిందని, ఇప్పటికైనా ఆ బిల్లును ఆమోందించేలా చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. ఆదిలాబాద్‌లో ఈ మధ్య జరిగిన ఘర్ష ణ విషయాలను, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను, ఆదివాసీలు, మైనార్టీ వర్గాల మధ్య సఖ్యతకు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు.
గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలన అధికారిగా ఆదిలాబాద్‌లో పర్యటించాలని గవర్నర్‌ను సీతక్క కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ములుగు మున్సిపా లటీ బిల్లుతోపాటు ఇతర పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలుపాలని గవర్నర్‌కు కోరినట్టు చెప్పారు.
ములుగులో ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో గవర్నర్ ఉన్నారని, గ్రామాల జాబితాను ఆయనకు పంపించినట్టు సీతక్క వివరించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు.