calender_icon.png 9 February, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన పర్వేశ్ వర్మ

09-02-2025 01:41:43 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ చేతిలో ఆప్ ఓడిపోవడాన్ని పక్కన పెడితే.. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్‌ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఓడించారు. సుమారు 4వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్‌ను పర్వేశ్ వర్మ ఎన్నికల బరిలో మట్టికరిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.

ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో సీఎంగా పార్టీ అధిష్టానం పర్వేశ్ వర్మనే ప్రకటిస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

ఎవరీ పర్వేశ్ వర్మ?

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్ వర్మ. 1977 నవంబర్ 7న జన్మించిన ఆయన.. ఆర్‌కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కిరోరీ మాల్ కాలేజీలో అండర్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఫోర్ స్కూల్‌లో ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

పర్వేశ్ వర్మ మొట్ట మొదటిసారిగా 2013లో రాజకీయ ప్రవేశం చేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున మోహ్రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి అసెంబ్లీ స్పీకర్ యోగానంద్‌శాస్త్రీని ఓడించారు. ఆ తర్వాత 2014 నుంచి 2024 వరకూ పశ్చిమ ఢిల్లీ  నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు.

2019 ఎన్నికల్లో ఆయన రికార్డు స్థాయిలో 5.78లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలోనే ఓ లోక్‌సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే సత్తా పర్వేశ్ వర్మకు ఉందని గ్రహించిన బీజేపీ.. ఆయనను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే పార్టీ తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కేజ్రీవాల్‌ను ఓడించారు.