calender_icon.png 23 October, 2024 | 7:08 AM

పార్టీకో పంథా!

17-09-2024 05:17:25 AM

1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లే.. తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించింది. అందుకే ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యమున్నది. ఈరోజును తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవమని భావించే వారు కొందరున్నారు. నైజాం పాలన నుంచి విముక్తి జరగక ముందు ఈ ప్రాంత ప్రజలు నైజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. రజాకార్లు నాడు ప్రజలపై పాల్పడిన అకృత్యాలపై ఇప్పటికీ చర్చ జరుగుతున్నది. అందుకే ఆ అంశం గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ కచ్చితంగా చర్చించాల్సిన ఓ అంశం ఒకటి ఉంది.

ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించడంలో ఏ రాజకీయ పార్టీది.. ఎంత పాత్ర అనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు స్వాతంత్య్రం రావడాన్ని అందరూ స్వాగతించి మరీ ఏకీభవిస్తున్నారు. కానీ ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి?  ఆ రోజును ఏ దినోత్సవంగా పిలవాలనే అంశంపై ఇప్పటికీ సందిగ్ధతే నెలకొన్నది. ఇదే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. సాయుధ పోరాట చరిత్రను ప్రజలకు చెప్పాల్సిన రాజకీయ పార్టీల్లో ఒక్కో పార్టీ ఈ రోజును ఒక్కో పేరును సూచిస్తున్నాయి. వాటిలో మెజార్టీ పార్టీలు వాటికవే పేరు పెట్టుకుని, వాటికవే అందుకు తగిన విధంగా ఉత్సవమో..? నిరసన కార్యక్రమాలో..? చేపడుతున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం మరింత ఎక్కువ అవుతుంది.

కమ్యూనిస్టులది ‘విద్రోహ’ వాదం..

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణ దేశంలో భాగమైంది. 1948  సెప్టెంబర్ 14 నుంచి ఇదే నెల 17 వరకు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం ప్రభుత్వంపై ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సైనిక చర్య జరిగింది. సైనిక చర్యతో నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. అలా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైంది. ఆపరేషన్ పోలో సమయంలో వేలాది మంది అమాయక ముస్లింలను సైతం ఒక వర్గం ఊచకోత కోశారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి.

నిజానికి నిజాం వ్యతిరేక పోరులో హిందువులతోపాటు షేక్ బందగీ వంటి ముస్లిం, ఉర్దూ కవి మగ్డూ మోహినోద్దీన్ సైతం ప్రముఖ పాత్ర పోషించారు. సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతున్న వేళ, ఆ పోరాటం విజయవంతమైతే తెలంగాణ కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే నాటి భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టిందనే వాదన దశాబ్దాల నుంచి కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయా పార్టీలు సెప్టెంబర్ 17ను విద్రోహ దినమని వాదిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ ‘సమైక్య’ వైఖరి..

బీఆర్‌ఎస్ తెలంగాణ ఏర్పాటు కోసమే పుట్టిన పార్టీ. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే ప్రధానంగా బీఆర్‌ఎస్‌కు సెప్టెంబర్ 17పై స్పష్టమైన వైఖరి ఉండాలి. కానీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఈ తేదీపై సందర్భానుసారంగా వ్యాఖ్యలు చేశారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఈ తేదీని విలీన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అంతకుముందు ఓ సందర్భంలో ఇదే తేదీని విమోచన దినోత్సవంగా జరుపుతామన్నారు. నాడు జేఏసీ చర్చల ఫలితంగా చివరకు కేసీఆర్ విలీనం అనే స్టాండ్ తీసుకున్నారు.

కానీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు వ్యతిరేకం కావొద్దనే ఉద్దేశంతో సమైక్యత రాగం అందుకున్నారు. ఇలా కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. తేదీపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం వలసవాదం, భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాటి ప్రజలు పోరాటం చేశారని, దీనిని భూభాగ విముక్తికి సంబంధించిన అంశంగానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగానే తేదీని జాతీయ సమైక్యతకు ప్రతీకగా భావించాలని, ఆ రోజున తెలంగాణ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 

‘పటేల్’ తమవాడని చెప్పుకోవడానికే ‘విమోచనమా’?..

సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి లభించినందున జాతీయ స్థాయిలో వేడుకల నిర్వహించడాన్ని స్వాగతించాల్సిందే. కానీ దానిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విముక్తి లభించిన నాటికి అసలు బీజేపీ పుట్టనే లేదని, ఇక ఆ పార్టీ సెప్టెంబర్ 17 గురించి ఎందుకు మాట్లాడాలని కొన్నివర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ విమోచన దినోత్సవం నిర్వహించాలని అంతా గట్టిగా డిమాండ్ చేయడంపై ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యతోనే తెలంగాణకు విముక్తి లభించిందనే వాదనపై బీజేపీ కూడా ఏకీభవిస్తున్నది.

ఈ విషయంలో పటేల్‌ను సైతం కొనియాడుతున్నది. విలీన సమయంలో పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీ నాయకుడు కాదు. మరి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేయడం వెనుక బీజేపీ ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బీజేపీ దాని అనుబంధాల ప్రోద్బలంతోనే గుజరాత్‌లోని నర్మదా తీరంలో పటేల్ భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను తమ నాయకుడిగా చెప్పుకోవడం కోసమే విమోచన దినోత్సవం నిర్వహించాలనే బీజేపీ ఉవ్విళ్లూరుతున్నదనే విమర్శలు ఉన్నాయి.

కాంగ్రెస్ ఎందుకు వెనుకబడింది..

నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే భారత్‌లో తెలంగాణ విలీనమైందనేది సుస్పష్టం. ఆయన పెద్ద కాంగ్రెస్ నేత. కానీ, ఆయన్ను తమ పార్టీ వాడని చెప్పుకోవడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంతో వెనుకబడింది. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే తెలంగాణ విలీనం జరిగితే ఆ క్రెడిట్ రావాల్సింది కాంగ్రెస్ పార్టీకి కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ మేరకు ప్రచారం చేసుకోవడం లేదు? నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. కమ్యూనిస్టులు అంటున్న విద్రోహ దినాన్నీ నిర్వహించలేదు.

ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇటు విలీనం, అటు విమోచనం కాకుండా ‘ప్రజాపాలన దినోత్సవ’ రాగాన్ని అందుకున్నది. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా చర్చ పెట్టి అసలు సాయుధం పోరాటం తర్వాత ఏం జరిగిందనే అంశంపై స్పష్టత ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజానీకం నుంచి వ్యక్తమవుతున్నది. 

క్రాంతి మల్లాడి

విజయక్రాంతి ప్రతినిధి