calender_icon.png 15 November, 2024 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విభజనే కాంగ్రెస్ ఫార్ములా

15-11-2024 01:02:31 AM

అధికారం కోసం పాకిస్థాన్ మాటను జపిస్తోంది

శివాజీని నమ్మేవారు కావాలా?

ఔరంగజేబ్‌ను ప్రశంసించే వారు కావాలా?

ప్రజలే నిర్ణయించుకోవాలి: ప్రధాని నరేంద్రమోదీ

ముంబై, నవంబర్ 14: కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఛత్రపతి శంభాజీనగర్ సభలో మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ విషయంలో కాంగ్రెస్ కూటమి పాకిస్థాన్ స్వరాన్ని వినిపిస్తోందని ఫైర్ అయ్యారు. ఆర్టికల్ 370 రద్దును పార్లమెంట్‌లో అడ్డుకోవడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కిందని దుయ్యబట్టారు. కశ్మీర్ భారత్‌లో భాగమనీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కశ్మీర్‌లో కూడా ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారన్నారు. మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలు కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మాత్రమే కాదన్నారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు శంభాజీ మహారాజ్‌ను నమ్మే దేశ భక్తులు ఉంటే మరోవైపు ఔరంగజేబ్‌ను ప్రశంసించే కూటమి ఉందన్నారు. ఇందులో ఎవరి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. 

రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం

రిజర్వేషన్లను కాంగ్రెస్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోందని ప్రధాని ఆరోపించారు. దేశానికి, మెరిట్ విధానానికి రిజర్వేషన్లు హానికరమంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ తన విధానాన్ని మార్చుకోలేపోతుందని దుయ్యబట్టారు. అందుకే గత 10 సంవత్సరాలుగా ఓబీసీకి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారని ఆరోపించారు. మహా వికాస్ అఘాడీ నేతలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలను చిన్న కులాలుగా విభజించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.

ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చాలని రాష్ట్ర ప్రజలు సహా శివసేన పార్టీ స్థాపకులు బాల్ ఠాక్రే కలలు కన్నారనీ, కలలను మహాయుతి ప్రభుత్వం నిజం చేసిందన్నారు. రాష్ట్రాన్ని రెండున్నరేళ్లు పాలించిన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వం కాంగ్రెస్ ఒత్తిడితో ఔరంగాబాద్ పేరు మార్చలేకపోయిందని విమర్శించారు. మహాయుతి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. తిరిగి మహాయుతి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. 

పేదవారిపై ప్రధాని చిన్న చూపు

మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నాందే డ్ లోక్‌సభకు సంబంధించి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన పేదవారిని ప్రధాని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. 25 మంది ధనవంతులకు సంబంధించిన రూ.16 కోట్ల రుణా లను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. ప్రధాని ధనికులను, పేదలను వేర్వేరుగా చూస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రధాని రాజ్యాంగానికి విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని ఎప్పుడూ రాజ్యాంగాన్ని చదవలేదని అందుకే ఆయన దాన్ని ఖాళీ పుస్తకంగా భావిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఖాళీ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ దాన్ని రాజ్యాంగంగా పేర్కొంటున్నారని బీజేపీ నేతలు చేసిన విమర్శలకు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. 

ఎవ్వరికీ సాధ్యం కాదు

రిజర్వేషన్లను తొలగించడం ఎవ్వరికీ సాధ్యం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పని చేస్తోందని, వాటిని ఎత్తేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోందంటూ బుధవారం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ ఖండించారు. రిజర్వేషన్లను తీసేయటం ఎవ్వరి తరం కాదని స్పష్టం చేశారు. వాటిని ప్రధాని నరేంద్రమోదీ తీసుకురాలేదన్నారు. బలహీనవర్గాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రిజర్వేషన్లను కల్పించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ తానొక్కడే రిజర్వేషన్లను కాపాడుతున్న వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.