17-04-2025 12:00:00 AM
ప్రపంచంలో ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చితే భారతదేశం పెద్దసంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 200కి పైగా పార్టీలు ఏర్పాటైనట్లు అంచనా. 23 మార్చి 2024 నాటి ‘భారత ఎన్నికల సంఘం’ ప్రకటన ప్రకారం దేశంలో 6 జాతీయ, 58 రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇదే సమయంలో 2,763 వరకు ఎటువంటి గుర్తిం పు లేని పార్టీలు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ తప్పనిసరిగా ఎన్నికల చిహ్నం కలిగి ఉండటం తోపాటు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పొలిటికల్ పార్టీలను గుర్తించడానికి చిహ్నాలే ఆధారం. నిరక్షరాస్యులు వీటి ఆధారంగానే ఆయా పార్టీల అభ్యర్థులకు ఎన్నికల్లో ఓటు వేస్తుంటారు. నిజానికి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం, మౌలిక సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య భావనను విస్తరింప చేయడం వంటి మరెన్నో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి పార్టీలు కృషి చేయా లి.
కానీ, అందుకు భిన్నంగా ఎన్నో పార్టీలు బూటకపు నినాదాలతో నేడు రాజ్యమేలుతున్నాయి. కాలయాపన, మొక్కుబడి పాలన, ప్రజా క్షేమంతో సంబంధం లేని కార్యకలాపాల నిర్వహణ, పెట్టుబడిదారులకు మేలు చేసే విధంగా ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం గుర్తింపు పొందినప్పటికీ ఆచరణలో ఆ భావన కొరవడడం ఆందోళనకరం.
తద్వారా మన దేశ పరువును మనమే దిగజార్చుకున్నట్టు అవుతు న్నది. వాస్తవానికి మెజార్టీ ప్రజలు ఓట్లు వేయడం ద్వారా చట్టసభల్లో సగానికిపైగా సీట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీ అధికారాన్ని చేపట్టాలి. కానీ, ప్రస్తుతం అలా జరగడం లేదు. మొత్తం ఓటర్లలో కేవలం 30 శాతం మంది మాత్రమే ఓట్లు వేస్తున్నప్పటికీ పార్టీలు అధికారంలోకి వస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ తరుణంలో మనం ప్రజాస్వామ్యానికి ఇచ్చిన నిర్వచనం నీరుగారి పోయినట్టుగానే భావించాల్సి ఉం టుంది. ఒకవైపు ప్రజాస్వామ్య సమాజం లో ఓటుహక్కు విలువ తెలిసికూడా ఓటు వేయడానికి చాలామంది నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. మరొకవైపు తక్కువమంది ఓట్లు వేసినప్పటికీ అధికారం చేజిక్కించుకోవచ్చని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. దీనివల్ల పూర్తి మెజారిటీతో కూడిన ప్రజాప్రభుత్వాలను ఇంతవరకు చూడలేకపో యాం. ఇది నిజంగా విచారకరం.
మేనిఫెస్టోలలో ఆ అంశాలేవి?
పేదరిక నిర్మూలన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు అవసరమైన కార్యాచరణ, మిగులు భూముల పంపిణీ, అసమానతల నిర్మూలన కోసం అధికారంలో ఉన్న పార్టీలు చేసిన కృషి ఎక్కడా కనిపించదు. ఇక నాణ్యమైన ఉచితవిద్య, వైద్యం వంటి అంశాలను తమ మేనిఫెస్టోలలో ప్రధాన ఎజెండాలుగా పార్టీలు చేర్చక పోవడం సిగ్గుచేటు.
ఉచితాల పేరుతో ప్రలోభ పెట్టేకంటే విద్య, వై ద్యానికి ప్రాధాన్యం ఇస్తామని, ఈ రెండూ ఉచితంగా అందించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచవచ్చని ఈ రకంగా పేదరికాన్ని తగ్గించవచ్చ ని, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చవచ్చనే సోయి ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీకి లేదు. ఆర్థిక వేత్తల అంచనాల ప్రకారం కనీస అవసరాలను తీర్చుకోగలిగిన స్థితినే నిజమైన మానవాభివృద్ధిగా భావించాలి.
తమ కనీస అవసరాలు తీర్చుకునే స్థాయి లో మన దేశంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ దేశంలో 15 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. కొండ లు, గుట్టలమధ్య నివాసం ఉండే ఆదివాసీలకు ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేవు.
అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్లాలంటే బాధితులను మంచంపై పడుకోబెట్టుకుని పదుల కిలోమీటర్లు నలుగు రు నడవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ద్వారా స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు దాటినా మనం సాధించాల్సింది చాలా ఉందనే విషయం అర్థమవుతున్నది.
అందువల్ల పాలక పక్షాలతోపాటు ప్రతిపక్షాలు కూడా తమను తాము సింహావ లోకనం చేసుకోవాలి. పనితనాలను ప్రక్షాళన చేసుకోవాలి. నిజమైన సమాజ హితం కోసం పనిచేయాలి. ప్రజల ఆదాయ మా ర్గాలను పెంచడానికి కావలసిన ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలామంది నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని దుస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.
తమకు వచ్చే ఆదాయంలో 60 శాతం వరకు చదువు, వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళ్తున్నారు. కానీ, పాలకులు కేవలం సమాజంలోని కొందరికి మాత్రమే మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రుణమాఫీలు చేస్తున్నారు. అయి తే, పట్టణాలు, పల్లెల్లో సరైన ఉపాధి లభించక అర్ధాకలితో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా సామాన్యుల యోగక్షేమాలపైనా పాలకులు, ప్రతిపక్షాలు రాజకీయా లకు అతీతంగా దృష్టి పెట్టాలి.
నిర్మాణాత్మక సూచనలు చేయాలి
ప్రతిపక్షాలు ఎంతసేపు అధికార పక్షా న్ని విమర్శించడానికి, ఎదిరించడానికే పరిమితం అవుతున్నాయి. అదే పనిగా వెంట పడి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అంతే తప్ప, నిర్మాణాత్మక సూచనలు చేయాలనే విషయాన్ని విస్మరిస్తున్నాయి. పేదరిక నిర్మూలన కోసం సంపదను సృష్టించే మార్గాలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. రాజకీయ పార్టీలకు సమసమాజ స్థాపన బహుశా ఇష్టం లేదు కాబోలు.
అందుకే పెత్తందారులకు ఊడిగం చేస్తూ, సంపద కొంతమంది చేతుల్లోనే ఉండేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్ప టికీ దేశంలో 80 కోట్ల మందికి రేషన్‌కార్డుల ద్వారా ఉచిత బియ్యం అంద జేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు పేదరికం తగ్గిందని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఇదే సమయం లో రేషన్ బియ్యాన్ని కొనసాగిస్తున్నారు. దీనిద్వారా పేదరికం పేపర్లలో తగ్గిందే తప్ప, వాస్తవ పరిస్థితుల్లో కాదనే విషయం స్పష్టమతున్నది.
అయితే, ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది ఉచిత బియ్యం కాదు, మెరుగైన ఉపాధి అవకాశాలు. ప్రజల్లో శ్ర మ శక్తిని పెంచాలి. ఆత్మస్థుర్యైన్ని నింపి, తమ కాళ్లమీద తాము నిలబడేలా చర్యలు తీసుకోవాలి. ఉచిత హామీల పేరుతో ప్ర భుత్వాలు ప్రజలను సోమరులుగా మారుస్తుంటే, ఆ హామీలను అమలు చేయడం లేదని ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు ఎదురుదాడి చేయడం అవగాహన రాహిత్యాం గానే భావించాలి. ప్రజలను అశక్తులను చేసే ఉచిత హామీలను తక్షణం విడనాడి స్వతంత్రంగా జీవించే విధంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికలు రచిస్తామని అన్ని రాజకీయ పార్టీలు ప్రమాణం చేయాలి.
ఈ విషయాన్ని గుర్తించకుండా ఒకరికి మించి మరొకరు హామీలను ప్రకటిస్తే దేశం లో ఎప్పటికీ సంపద సృష్టి జరగదు. దేశం అభివృద్ధి చెందదు. ప్రజలను యాచకులుగా కాకుండా ప్రభువులుగా చూడా ల్సి ఉంది. ఇలాంటి ఆలోచనా ధోరణి ముందు గా రాజకీయ పార్టీల్లో వస్తే ప్రజ ల్లో సైతం తప్పక మార్పు వస్తుంది. ప్రజలలోనూ మార్పు రావాలి.
పాలకులు ఈ సారి ఏమిస్తారో అని చేతులు చాచడానికి అలవాటు పడరనే విషయాన్ని రాజకీ య నాయకులు తెలుసుకుంటే మంచిది. ఉచి త విద్య, వైద్యం, సామాజిక న్యాయం, సమానత్వం, అంతరాలు లేని వ్యవస్థ, పేదరిక నిర్మూలన వంటి కీలక అంశాలపైన ప్రతిపక్షాలు దృష్టి పెట్టాలి. ఈ దృక్పథంతో పాలక పక్షాలను విపక్షాలు నిలదీయాలి. ఇవేవీ లేకుండా మాట్లాడే రాజకీయ పార్టీలు భవిష్యత్తులో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు.