calender_icon.png 29 September, 2024 | 3:52 PM

పార్టీలకు కింగ్‌మేకర్ల భయం

29-09-2024 02:16:07 AM

హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ

  1. రెండు పార్టీలనూ భయపెడుతున్న చిన్నపార్టీలు
  2. బీజేపీకి రైతులు, రెజ్లరు, అగ్నివీర్ల భయం
  3. ముఠా గొడవలతో కాంగ్రెస్ సతమతం

చండీగఢ్, సెప్టెంబర్ 28: మరో వారంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న హర్యానా లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మ్యానిఫె స్టోలు ప్రకటించిన ఈ రెండు పార్టీలు.. తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా తదితరులంతా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీనే ప్రధానంగా పోరాడుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీలకు కింగ్ మేకర్ల భయం పట్టుకొన్నది. రాష్ట్రంలోని చిన్నపార్టీలు ఎవరి కొంప ముంచుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

దశాబ్ద కాలంగా హోరాహోరీ

హర్యానాలో దశాబ్ద కాలంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి. 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా ప్రజ లు ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. హర్యా నా అసెంబ్లీలో 90 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. 46 సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది.

అయితే, ఈ రెండు పార్టీలు 2009, 2019లో 40 సీట్ల వద్దనే ఆగిపోయాయి. 2009లో స్వతంత్రుల సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిం ది. 2019లో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం నెలకొల్పింది. 

చిన్నపార్టీల చికాకు

ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎన్నికల బరిలో చాలా చిన్నపార్టీలు నిలిచాయి. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ కూటమి, జేజేపీ ఆజాద్ సమాజ్ పార్టీ కూటమితోపాటు గోపాల్ కంద నేతృత్వంలోని హర్యానా లోఖిత్ పార్టీ కూ డా బరిలో ఉన్నది. ఈ కూటములు, పార్టీలు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి.

ఇవి రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపలేకపోయినా కొన్ని సీట్లలో బలంగా ఉన్నాయి. ఎక్కడ తమ విజయావకాశాలకు గండి పడుతుందోనని కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయి. ప్రజలు ఏ పార్టీకి సంపూర్ణ విజయం ఇవ్వకపోతే ఈ చిన్నపార్టీలు, స్వతంత్రులే మళ్లీ కింగ్ మేకర్లుగా మారుతారు. 

ఒక్కో సీటుకు 12 మంది పోటీ

ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు 1051 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అంటే ఒక్కో సీటుకు 11.7 మంది పోటీ పడుతున్నట్టు లెక్క. 2009లో 1,222 మంది, 2014లో 1,351 మంది, 2019లో 1,169 మం ది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఓక్కో అసెంబ్లీ స్థానంలో సగటున చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండటం ప్రధాన పార్టీల్లో గుబు లు రేపుతున్నది.

రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 200 మంది అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకొంటున్నారు. 2014లో 61 సీట్లలో గెలిచిన అభ్యర్థి తన సమీ ప ప్రత్యర్థికంటే ఎంత ఎక్కువ ఓట్లు సాధించాడో (మార్జిన్ ఓట్లు) ఆ నియోజకవర్గంలో మూడోస్థానంలో నిలిచిన వ్యక్తికి అంతకంటే ఎక్కువ ఓట్లు రావటం గమనార్హం.

2019లో ఈ పరిస్థితి 51 స్థానాలకు పరిమితమైంది. ఇలా మూడు, నాలుగో స్థానంలో నిలుస్తున్న వ్యక్తులు గెలుపు గుర్రాలకు కళ్లేలు వేస్తున్నారు. గెలుపు ఓటములను తారుమారు చేస్తున్నారు. 2009లో 35 స్థానాల్లో ముక్కోణపు పోటీ జరుగగా, 2014లో 49 చోట్ల, 2019లో 28 చోట్ల ఇలాంటి పోటీ కొనసాగింది. 

ఒక్కసీటుతోనూ కింగ్‌మేకర్ కావచ్చు

హోరాహోరీ పోటీ ఉన్నచోట చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులే కింగ్ మేకర్లుగా అవతరిస్తారు. ఒక్కోసారి ఒక్క సీటు గెలిచిన పార్టీ కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టగలదు, పడగొట్టగలదు. హర్యానాలోనూ అవే పరిస్థితులు ఉన్నా యి. ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలను ఎన్నికల లెక్కల్లో ఇతరులు అని సంబోధించటం పరిపాటి.

హర్యానాలో ఈ ‘ఇతరులు’ 2009లో కీలకంగా మారారు. వీరు ఏకంగా 30 ఓట్లు సాధించి 15 సీట్లు గెలిచారు. 2019 వచ్చేనాటికి వీరి ప్రభావం 18 శాతం ఓట్లతో 8 సీట్లకు పడిపోయింది. 2009లో 85 సీట్లలో ప్రభావం చూపించగా, 2019లో 44 సీట్లలోనే బలంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ బీఎస్పీ కూటమి జాట్ల ఓట్లను కొల్లగొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో దళితులు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరిలో కొంతమొత్తం ఓట్లయినా సాధించాలని ఈ కూటమి వ్యూహాల రచిస్తున్నది. మరోవైపు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి జేజేపీ బలహీనపడటంతో ఓటర్లు తమవైపు తిరుగుతారని ఆ కూటమికి ఆశలు పెట్టుకొ న్నది. జేజేపీ 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లు సాధించి 10 సీట్లు గెలిచింది.

ఇప్పుడు ఆ పార్టీ ఏఎస్పీతో జతకట్టి దళిత ఓటర్లకు గాలం వేస్తున్నది. కానీ, 2019 నాటికంటే జేజేపీ ఇప్పుడు బలహీనంగా కనిపిస్తున్నదని రాజకీయ పండితులు చెప్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి విడు దల కావటంతో రాష్ట్రంలో ఆప్‌లోనూ ఊపు వచ్చింది. ఆయన కూడా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ఈసారి ఎలాగైన రాష్ట్రం లో ఖాతా తెరువాలని ఆప్ నేతలు పోరాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకే మేలు చేసే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ భయపడుతున్నది. మరోవైపు రైతులు, రెజ్లర్లు, అగ్నివీర్లను చూసి బీజేపీ భయపడుతున్నది.

రైతులు ఇప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై పోరాడుతుండటం, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేసిన రెజ్లర్లపట్ల కేంద్రం కఠినంగా వ్యవహరించటం, సైన్యంలో చేరేందుకు కొత్తగా తెచ్చిన అగ్నివీర్ పథకం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆయా వర్గాలు తమకు ఎక్కడ ప్రమాదకరంగా మారుతాయోనని కమలనాథులు కంగారుపడుతున్నారు.