- అబ్దుల్లాపూర్‌మెట్‌లో కత్తులతో దాడికి యత్నించిన దుండగులు
- గాల్లో కాల్పులు జరిపి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నల్లగొండ జూలై 5 (విజయక్రాంతి)/అబ్దుల్లాపూర్‌మెట్ : జాతీ య రహదారులపై దారి దోపిడీ చేసే పార్థి గ్యాంగ్ దొంగలను పోలీసులు చేజ్ చేసి అరెస్టు చేశారు. పార్థి గ్యాంగ్‌లోని ఇద్దరు దొంగలు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో చోరీ చేయడానికి రెక్కీ నిర్వహించారు. రెక్కీ అనంతరం శుక్రవారం ఉదయం 9 గంటలకు కొత్తగూడెం చౌరస్తాలో చౌటుప్పల్ నుంచి నగరానికి వెళ్తున్న టాటా ఏస్ ప్యాసింజర్ ఆటోను ఆపి ఎక్కారు. పక్కా సమాచారం తెలుసుకున్న నల్లగొండ జిల్లా సీసీఎస్ పోలీసులు టాటా ఏస్ ప్యాసింజర్ ఆటోను వెంబడించి, ఔటర్ రింగ్ రోడ్డులో అడ్డుకున్నారు.
ముఠా సభ్యులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపై కత్తులతో దాడికి ప్రయత్నించి తిరగపడ్డారు. దీంతో ఒక రౌండ్ గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఈ దోపిడీ ముఠా అనేక నేరాలతోపాటు హత్యలకు పాల్పడ్డారు. గత నెలరోజుల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూరు సమీపంలో 10 వేల నగదు కోసం ఓ డ్రైవర్‌ను హత్య చేశారు. హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులు హత్య చేసింది పార్థి గ్యాంగ్‌గా నిర్ధారించారు.
అప్పటి నుంచి వీరిని అరెస్టు చేయడానికి నల్లగొండ జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 9 గంటలకు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో టాటా ఏస్ ప్యాసింజర్ ఆటోను వెంబడించి, దొంగలను పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి, విచారణ నిమిత్తం నల్లగొండకు తరలించారు. మరో ఇద్దరు ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. వీరిని గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి పరిశీలించారు. పార్థి గ్యాంగ్ చేసిన నేరాలపై గుట్టు వీడనున్నదని పోలీసులు భావిస్తున్నారు.