22-04-2025 06:34:56 PM
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తెలంగాణ దక్షిణ ప్రాంగణం పార్ట్ టైం అధ్యాపకులు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ నిరవధిక సమ్మె నోటీస్ అందించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ... ఈనెల 17న చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా తాత్కాలిక అధ్యాపకులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికి చర్యగా తాము భావిస్తున్నామని అన్నారు.
పార్ట్ టైం అధ్యాపకులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ప్రభుత్వ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, జీవో నెంబర్ 21 ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకొని రెగ్యులర్ నోటిఫికేషన్ లో తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మొదటి రోజు నిరవధిక సమ్మెలో పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొనగా విద్యార్థులు తమ అధ్యాపకులకు సంఘీభావాన్ని తెలిపారు.