calender_icon.png 2 October, 2024 | 8:00 PM

డేరాబాబాకు పెరోల్.. కాంగ్రెస్ ఫైర్

02-10-2024 01:49:33 AM

  1. ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది
  2. ఈసీకి లేఖ రాసిన హర్యానా పీసీసీ

చండీగఢ్, సెప్టెంబర్ 29: హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా బాబా గుర్మీత్ రాంరహీమ్‌సింగ్ పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి మంగళ వారం లేఖ రాసింది.

ఎలక్షన్ సమయంలో జైలు నుంచి డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. 2019లో డేరా బాబా చేతిలో హత్యకు గురైన జర్నలిస్ట్ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్‌ను వ్యతిరేకించారు.

ఎన్నికల సమయంలో డేరా బాబాకు పెరోల్ ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పారు. ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను ఇవ్వటం వల్ల ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించారు. 

గతంలోనూ పెరోల్

డేరా బాబాకు పంజాబ్, యూపీ, హర్యానాలో లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉన్న నేపథ్యంలో డేరా బాబాకు పెరోల్ ఇవ్వడాన్ని హస్తం పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇద్దరు మహిళా అనుచరులపై అ త్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2017 లో గుర్మీత్ జైలుపాలయ్యారు. 2020లో అసెంబ్లీ ఎన్నికల ముందు పెరోల్‌పై విడుదల కావడం గమనార్హం.