- పోలీసుల చర్యలతోనూ ఆగని ఆక్రమణలు
- వివాదాస్పద స్థలాలను సైతం వదలని వైనం
- కరీంనగర్‌లో అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాల కబ్జా
- చదును చేసి ప్లాట్లుగా విక్రయించే యత్నం
- నిమ్మకు నీరెత్తినట్టు అధికారుల వ్యవహారం
కరీంనగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): భూ కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కరీంనగర్‌లో ప్రభుత్వ, పార్కు, వివాదాస్పద స్థలాల ఆక్రమణలు ఆగడంలేదు. ఈక్రమం లోనే నగరంలోని 39వ డివిజన్ పరిధిలోగల విద్యానగర్‌లో ఉన్న బత్తుల వెంకన్న చిల్డ్రన్స్ పార్కుపై కబ్జాదారుల కన్ను పడింది.
పాతికేళ్లకు పూర్వం 1237 సర్వే నెంబర్‌లో లే అవుట్ చేసిన సమయంలో పీ అండ్ టీ(పార్కు, ఆలయం) కింద స్థలాన్ని వదిలారు. గతంలో ఈ స్థలాన్ని కబ్జా చేయడా నికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ స్థలంలోనే స్థానిక కార్పొరేటర్ అప్పట్లో ఈ డివిజన్‌కు ప్రాతినిథ్యం వహించిన బత్తుల వెంకన్న పేరుతో చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేశారు.
అయితే ఇదే స్థలంలో మహిళా సంఘ భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం గతంలో రూ.20 లక్షలు మంజూరు చేసింది. కానీ ఆ స్థలాన్ని ఆక్రమించాలని కొందరు అక్రమార్కులు అక్కడ పనులు జరగకుండా అడ్డుపడగా.. చుట్టుపక్కలవారంతా కలిసి పార్కును ఏర్పాటు చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం అక్కడి భూముల ధరలు పెరగడంతో పార్కుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయాత్నాలు ప్రారంభించారు.
రేకుర్తిలోనూ ఇదే పరిస్థితి!
నగరంలోని 18, 19 డివిజన్ పరిధిలో ఉన్న రేకుర్తిలో 153 సర్వే నెంబర్‌లో ఉన్న 18 గుంటల పార్కు స్థలాన్నీ కబ్జాదారులు వదలడం లేదు. పట్టాదారులు, యజమానికి మధ్య వివాదం కారణంగా.. లే అవుట్‌లో భాగంగా పార్కు కోసం వదిలిన ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. షేఖాన్ వారసులకు సంబంధించిన ఈ స్థలాన్ని గతంలో 70 మంది కొనుగోలు చేశారు.
ప్రస్తుతం పట్టాదారులు, షేఖాన్ వారసులకు మధ్య స్థల వివాదం నెలకొనగా పక్కనున్న పార్కు స్థలంపై అక్రమార్కులు కన్నేశారు. నగరపాలక సంస్థ బాజాప్త ఈ స్థలం పార్కుదని బోర్డు పాతినా.. టౌన్ ప్లానింగ్ అధికారులు, 18, 19 డివిజన్‌కు చెందిన కార్పొరేటర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఈ పార్కు స్థలం 19వ డివిజన్ పరిధిలో ఉండగా 18వ డివిజన్‌ను ఆనుకొని ఉంటుంది. అయితే ఇందులోని మూడు గుంటల స్థలంలో పనులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వ స్థలాలను కాపాడాలి..
విద్యానగర్‌కు మా నాన్న బత్తుల వెంకన్న ప్రాతినిథ్యం వహించారు. ఇక్కడ స్థలం లే అవుట్ చేసిన సందర్భంలో పార్కు, దేవాలయం కోసం వదిలిపెట్టిన స్థలాన్ని కాపాడేందుకు ఆయన చాలా ప్రయత్నం చేశారు. కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు.
నేను కార్పొరే టర్‌గా ఈ స్థలాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారి పేరుతో చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేశాం. ఈ పార్కును కబ్జా చేయాలని చూస్తే ప్రజల సహకారంతో ఆందోళన చేస్తా. మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం ప్రభుత్వ స్థలాలు, పార్కులను కాపాడాలని కోరుతున్నా.
39వ డివిజన్ కార్పొరేటర్
కొండపల్లి సరితాసతీశ్