- నాగోల్, మియాపూర్ స్టేషన్ల పరిధిలో అమలుకు నిర్ణయం
- ఈ నెల 15 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్లు బోర్డులు ఏర్పాటు
- నెల రోజులుగా ట్రయల్ రన్ చేస్తున్న ఎల్‌అండ్‌టీ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్12 (విజయక్రాంతి): మెట్రో ప్రయాణికులపై పార్కింగ్ భారం పడనుంది. కొన్నేళ్లుగా ఉచిత పార్కింగ్ సదుపాయం ఉన్న నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద గల పార్కింగ్‌లలో పెయిడ్ పార్కింగ్ అమలు చేసేందు కు ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సంస్థ సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయబోతున్నట్లు నాగోల్, మియాపూ ర్ మెట్రో స్టేషన్ల వద్ద గల పార్కింగ్ స్థలాల్లో సంస్థ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులపై పార్కింగ్ ఛార్జీల బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. అందులో భాగంగా దాదాపు నెల రోజుల నుంచి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తోంది.
ప్రయాణికులకు ఊహించని షాక్..
నాగోల్, మియాపూర్ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు, రోజువారి పనులు చూసుకునే వారు అనేక మంది ఉన్నారు. ఈ క్రమంలో సొంత వాహనాలపై వెళ్లేవారు ఎక్కువ సమయం ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోంది. దీంతో అనేక మంది మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే, మెట్రోకు చివరి స్టేషన్లయిన నాగోల్, మియాపూర్‌లో కొన్నేళ్లుగా ఫ్రీ పార్కింగ్ అమలులో ఉండడంతో ప్రయాణికులు సులభతరంగా భావించి అక్కడ పార్కింగ్ చేసి ఆఫీసులకు, పనుల నిమిత్తం వెళ్లేవారు. ప్రతిరోజు వందలాది వాహనాలు పార్కింగ్ చేసేవారు.
ఈ క్రమంలో ఆగస్టు 14న నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద గల ఫ్రీ పార్కింగ్‌లో పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు బోర్డును ఏర్పాటు చేసి ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దీంతో భగ్గుమన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన కు దిగారు. ప్రయాణికులు, నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎల్‌అండ్‌టీ అధికారులు తమ ఆలోచనను విరమిం చుకున్నారు. ఆగస్టు 24 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయబో తున్నట్లు ప్రకటించారు.
దీంతో ప్రయాణికులు, పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళ నలు జరిగాయి. అనంతరం సెప్టెంబర్ 15 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్లు ఆగస్టు 30న నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద గల పార్కింగ్‌లో మరోసారి బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే, ఒకవేళ 15వ తేదీ నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయకపోయినా.. కొంతకాలం తర్వాతనైనా పెయిడ్ పార్కింగ్ అమలు తప్పనిసరి అని విశ్వసనీయ సమాచారం.
ధరలలో వ్యత్యాసం..
నగరంలోని బ్లూ, రెడ్, గ్రీన్ మెట్రో కారిడార్లలో మొత్తం 59 మెట్రో స్టేషన్లు ఉండగా 20కి పైగా మెట్రో స్టేషన్లలో పార్కింగ్ అమలులో ఉంది. వీటిలో పలు స్టేషన్ల వద్ద హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థలు పార్కింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. ఈ మెట్రో స్టేషన్ల వద్ద గల పార్కింగ్‌లలో హెచ్‌ఎంఆర్‌ఎల్ నిర్వహిస్తున్న మెట్రో స్టేషన్లలో బైక్‌కు కనీసం రెండు గంటలకు రూ.10, కారుకు రూ. 30 ఛార్జీలను వసూలు చేస్తుండగా.. గత నెలలో నాగోల్, మియాపూర్‌లో ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన బోర్డులోని ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ఆ పట్టికను అధికారులు తొలగించారు. అయితే, పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్న ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ పార్కింగ్ ఛార్జీల వివరాలను ఇంకా ప్రకటించలేదు. హెచ్‌ఎంఆర్‌ఎల్ పార్కింగ్ ప్రకారం ఒక్కో ఉద్యోగి బైక్‌కు రోజుకు దాదాపు రూ. 80 చొప్పున నెలకు దాదాపు రూ. 2 వేల వరకు పార్కింగ్ కోసం వెచ్చించాల్సి వస్తుంది. కారుకు రోజుకు దాదాపు 120 చొప్పున నెలకు దాదాపు రూ. మూడు వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
పెయిడ్ పార్కింగ్ సరికాదు
మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కిం గ్ అమలు చేయాలనుకోవడం సరికాదు. కొంతకాలంగా ఇక్కడే ఉచితంగా పార్కింగ్ చేసి హైటెక్ సిటీలో ఉద్యోగానికి వెళ్తున్నా. మెట్రో టికెట్‌తో పాటు అదనంగా పార్కింగ్‌కు ధర చెల్లించడం కంటే సొంత వాహనాల్లోనే వెళ్లడం ఉత్తమం అనిపిస్తుంది.
సుశీల్‌కుమార్, నాగోల్
ట్రాఫిక్‌పై ప్రభావం పడుతుంది..
ఇంతకాలం ఉచిత పార్కింగ్ ఉం డడంతో వాహనాన్ని పార్కింగ్ చేసి ఉద్యోగాలకు వెళ్తున్నాం. పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్‌పై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ పెయిడ్ పార్కింగ్ ఉన్నా ఛార్జీలు అందుబాటులో ఉండాలి.
వివేక్, నాగోల్