calender_icon.png 30 September, 2024 | 11:41 AM

పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్

30-09-2024 01:44:01 AM

బైక్‌చోరీ ముఠా అరెస్టు

18 బైక్‌లు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి):  గాంధీ, నిలోఫర్, ఈఎస్‌ఐ ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్‌గా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు చిలకలగూడ పోలీసులు. పరిగి ప్రాంతానికి చెందిన కె.శ్రీనివాస్(35) 15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు.

ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించేందుకు బైక్ చోరీలు చేయడం ప్రారంభించాడు. గాంధీ, నిలోఫర్, ఈఎస్‌ఐ ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేసేవాడు. ఇలా దొంగలించ వాహనాలను చర్లపల్లికి చెందిన బెజవాడ యేసు రత్నం(38), బెజవాడ శాంతరావు(28), దోమాయిగూడకు చెందిన అన్నంగి శ్రీను(32)కు విక్రయించేవాడు.

ఇలా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 18 బైక్‌లను చోరీ చేశాడు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం నిందితుడితో పాటు అతడికి సహకరిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారినుంచి 18 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు.