హైదరాబాద్, (విజయక్రాంతి): వికసిత్ భారత్ లో పరిషత్ విద్యార్థులు ముందుండాలని ఏబీవీపీ అఖిల భారత మహాసభల్లో తీర్మానం చేశారని ఆ సంఘం జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజ్, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు. బుధవారం ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి శ్రావణ్ బి రాజ్ మాట్లాడుతూ... అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 70వ జాతీయ సమావేశం నవంబర్ 22-24, 2024 వరకు గోరఖ్‌పూర్‌లోని దీనదయాళ్ ఉపాధ్యాయ విశ్వవిద్యాలయంలో జరిగాయన్నారు.
ఈ సంవత్సరం ఏబీవీపీ రికార్డు స్థాయిలో 5,512,470 సభ్యత్వాన్ని సాధించింది, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా స్థానాన్ని పునరుద్ఘాటించింది. విద్య నాణ్యత, ఫీజుల పెంపు, ఆహార కల్తీ, అంతర్జాతీయ వేదికలపై భారత్ దౌత్యం, మణిపూర్‌లో హింసను ఖండిస్తూ ఈ సదస్సు ఐదు తీర్మానాలను ఆమోదించిందని తెలిపారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ... ఏబీవీపీ జాతీయ మహాసభల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా యువ మంచ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
దీని ముఖ్య ఉద్దేశం వికసిత్ భారత్ కోసం విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, పొలిటికల్ ఇస్లాం, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, మీడియా సోషల్ మీడియా, సొసైటీ, బార్డర్ ఇష్యూస్ లాంటి అనేక అంశాలు 2047 విజన్ కోసం ఏ విధంగా ఈ అంశాల యొక్క పాత్ర ఉండాలనేది విద్యార్థుల వినూత్నమైన కాన్సెప్ట్స్ ద్వారా విద్యార్థులే విద్యార్థులకు అర్థం చేసే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ యువ మంచ్ లో అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క విద్యార్థి నాయకులు పాల్గొని ఒక్కో అంశం పైన వికసిత్ భారత్ కోసం విజన్ ఆఫ్ 2047 గురించి అనేక వినూత్నమైన కాన్సెప్ట్స్ ని విద్యార్థుల ముందు ఉంచి వీటి ద్వారా వికసిత్ భారత్ ను సాధించగలము అని ఒక సంకల్పాన్ని విద్యార్థుల ముందు ఉంచడం జరిగింది. ఈ సమావేశంలో సిటీ సెక్రెటరీ శ్రీకాంత్, స్టేట్ జాయింట్ సెక్రెటరీలు శ్రీనాథ్, పృద్వి, కళ్యాణీలు పాల్గొన్నారు.