న్యూఢిల్లీ: భారత ఈక్వేస్ట్రియన్ ప్లేయర్ అనూష్ అగర్వాల్ ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మరో ఈక్వేస్ట్రియన్ శ్రుతి వోరాతో పోలిస్తే అనూష్ యావరేజ్ మెరుగ్గా ఉండడంతో అతడినే ఎంపిక చేసినట్లు ఈక్వేస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా (ఈఎఫ్‌ఐ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఆసియా గేమ్స్‌లో అనూష్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలవడంతో పాటు వ్యక్తిగత డ్రెస్సేజ్ ఈవెంట్‌లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. 2023 నుంచి 2024 ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ పీరియడ్‌లో అనూష్ కనీస అర్హత (ఎంఈఆర్) మార్క్‌ను నాలుగు సార్లు సాధించాడు.
అయితే శ్రుతి వోరా రెండుసార్లు మాత్రమే ఎంఈఆర్ మార్క్ అందుకుంది. ఏడాది కాలంలో తమ ప్రదర్శనతో అనీశ్ 67.695 పర్సంటేజీ.. వోరా 67.163 పర్సంటేజీతో నిలిచారు. ‘ఈఎఫ్‌ఐ నిబంధనల ప్రకారం పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఒక రైడర్ 67 శాతం పర్సంటేజీతో నిలవాలి. అయితే అనూష్, శ్రుతి వోరాలు ఇద్దరు 67 శాతం మార్క్‌ను అధిగమించారు. కానీ ఇద్దరిలో యావరేజ్ స్కోరు అనూష్‌కు ఎక్కువగా ఉంది.
దీంతో అనూష్‌ను పారిస్ ఒలింపిక్స్‌కు పంపించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది’ అని సమాఖ్య ప్రతినిధి ఒకరు తెలిపారు. గతంలో ఈక్వేస్ట్రియన్ విభాగంలో భారత్ నుంచి ఫహాద్ మీర్జా, ఇంతియాజ్ అనీస్, ఇంద్రజీత్ లాంబా, జితేంద్రజిత్, హుస్సేన్ సింగ్, మొహమ్మద్ ఖాన్, డర్యా సింగ్ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించారు.