calender_icon.png 25 October, 2024 | 5:51 AM

పారిస్ పిలుస్తోంది!

17-07-2024 07:15:28 AM

పసి పిల్లల నుంచి పండు ముదసలి వరకు.. సాధారణ ప్రజానీకం నుంచి దేశాధ్యక్షుల వరకు.. తన, పర అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి రగిల్చే ప్రపంచ అతిపెద్ద ఆటల పండగ మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌కు ఈ సారి పారిస్ ఆతిథ్యమిస్తుండగా.. క్రీడా యవనికపై తమపేరు చిరస్థాయిగా నిలుపుకోవాలని అథ్లెట్లు సమాయత్తమవుతున్నారు. ‘గొప్ప భవిష్యత్తు స్వప్నించాలంటే చరిత్రపై పట్టు ఉండాలి’ అన్నట్లు.. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలకు ముందు.. విశ్వక్రీడల చరిత్రలో మన ప్రదర్శనలను ఓసారి పరికించి చూద్దాం..

ప్రపంచ క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ క్రీడలు.. 1896 నుంచి కొత్త రూపు సంతరించుకున్నాయి. గ్రీస్‌లోని ఏథేన్స్ వేదికగా జరిగిన తొలి మోడ్రన్ ఒలింపిక్స్‌లో మొత్తం 14 దేశాలకు చెందిన 241 మంది అథ్లెట్లు 43 క్రీడాంశాల్లో పాలుపంచుకోగా.. ఆ మరుసటిసారి (1900) పారిస్‌లో జరిగిన క్రీడల్లో భారత్ విశ్వక్రీడల్లో అడుగుపెట్టింది. బ్రిటీష్ పాలనలో ఉన్నమనదేశంలో నుంచి ఆ క్రీడల్లో బరిలోకి ఏకైక అథ్లెట్ నార్మన్ ప్రిచార్డ్ రెండు రజత పతకాలు సాధించాడు. తర్వాత మరో మూడు ఒలింపిక్స్ వరకు భారత్ నుంచి ఒక్క అథ్లెట్ కూడా విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహించలేదు. 1920 నుంచి స్వదేశీ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీపడుతూ ఉండగా.. 1928 ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పసిడి పతకంతో మెరిసింది. అది మొదలు హాకీలో వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన భారత్.. ఇప్పటి వరకు మొత్తం 25 ఒలింపిక్స్‌లో పాల్గొని 35 పతకాలు సాధించింది. 

మరో తొమ్మిది రోజుల్లో ఒలింపిక్స్

  1. ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం 1900లో ప్రారంభమైంది. 
  2. 1900 ఒలింపిక్స్‌లో భారత్ నుంచి బరిలోకి దిగిన ఏకైక బ్రిటిష్ అథ్లెట్ నార్మన్ ప్రిచార్డ్ పురుషుల 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు.
  3. టోక్యో ఒలింపిక్స్ (2020)లో మన దేశం నుంచి 124 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఈ సారి 113 మంది క్రీడాకారులు విశ్వక్రీడల బరిలో దిగనున్నారు. 
  4. గత ఒలింపిక్ క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. గతంలో ఏ క్రీడల్లోనూ సాధ్యం కాని రీతిలో టోక్యోలో మన అథ్లెట్లు ఏడు పతకాలు నెగ్గారు. 2012లో ఆరు పతకాల రికార్డును బ్రేక్ చేశారు. 
  5. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నార్మన్ ప్రిచార్డ్ రికార్డుల్లోకెక్కాడు. అయితే అప్పటికి దేశానికి స్వాతంత్య్రం రాకపోవడంతో అతడిని అత్యధికులు బ్రిటన్ అథ్లెట్‌గానే పరిగణించారు. ఆ తర్వాత 1952లో కేడీ జాధవ్ (రెజ్లింగ్) ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం (కాంస్యం) సాధించిన మొదటి స్వదేశీ అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కాడు. 
  6. ఒలింపిక్స్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఘనత షూటర్ అభినవ్ బింద్రాది (2008 బీజింగ్).
  7. విశ్వక్రీడల్లో పతకం (కాంస్యం) నెగ్గిన తొలి భారత మహిళగా తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి (వెయిట్ లిఫ్టింగ్; 2000, సిడ్నీ) నిలిచింది.
  8. వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రెజ్లర్ సుశీల్ కుమార్ రికార్డుల్లోకెక్కాడు.  2008 బీజింగ్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన సుశీల్.. 2012 లండన్‌లో రజతంలో మెరిశాడు.  
  9. భారత్ నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలి స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్‌గా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌చోప్రా నిలిచాడు. 
  10. ఒలింపిక్స్‌లో అత్యధికంగా భారత్ హాకీలో 12 పతకాలు సాధించింది. అందులో 8 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. 
  11. పురుషుల ఫీల్డ్ హాకీ తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధికంగా రెజ్లింగ్‌లో 7 పతకాలు దక్కాయి. గత కొన్ని విశ్వక్రీడల నుంచి మల్లయుద్ధంలో మనకు కనీసం ఒక పతకం దక్కుతూ వస్తోంది.