మహేశ్వరం, నవంబర్ 19 (విజయక్రాంతి): తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారని, వారి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండలం పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనంపై ఆరా తీశారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం మన్సాన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేను కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.