13-04-2025 10:45:45 PM
ఖర్టూమ్: ఉత్తర ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) బలగాల దాడిలో 100మందికి పైగా మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మృతుల్లో 20 మంది పిల్లలు, 9 మంది సహాయ కార్మికులు సహా 100మందికి పైగా ఉన్నారని పేర్కొంది. సూడాన్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి, మానవతా సమన్వయ కర్త క్లెమెంటైన్ సలామి శనివారం మాట్లాడుతూ..పశ్చిమ సూడాన్‌లోని జామ్జామ్, అబుషోరూక్ శిబిరాలు, ఉత్తర డార్ఫర్ ప్రావిన్స్ రాజధాని ఎల్‌ఫాషర్ నగరంలోని శిబిరంపై శుక్ర, శనివారాల్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) బలగాలు దాడి చేశాయని పేర్కొన్నారు. 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ మాజీ డిప్యూటీ, ఆర్‌ఎస్‌ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి.
సూడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 70లక్షలకు పైగా సూడాన్‌ను వదిలివెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. లక్షలాది మంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, సూడాన్ జనాభాలో సగం మంది తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్నారని గ్లోబల్ హంగర్ మానిటరింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. దేశ అంతర్యుద్ధంలో ఆర్‌ఎస్‌ఎఫ్ మహిళలు, బాలికలపై భయంకరమైన లైంగిక దాడులకు పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈనెల ప్రారంభంలో ఒక నివేదికను కూడా ప్రచురించింది.