calender_icon.png 2 November, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదుల వేటకు పారాకమాండోలు

21-07-2024 01:29:53 AM

న్యూఢిల్లీ, జూలై 20: జమ్మూలో ఉగ్రవాదులు పట్రేగిపోతుండటంతో వారిని అణచివేసేందుకు సైన్యం కీలక నిర్ణయం తీసుకొన్నది. ముష్కరులను మట్టుబెట్టేందుకు 500 మంది పారా కమాండోలను రంగంలోకి దించింది. పాకిస్థాన్ నుంచి 60 మంది ఉగ్రవాదులు జమ్మూలోకి చొరబడి దట్టమైన అడవుల్లో దాక్కొంటూ సైన్యంపై దాడులు చేస్తున్నారు. వీరి దాడుల్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోయారు. దీంతో వారిని వేటాడేందుకు రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన రోమియో, డెల్టా దళాల్లోని మెరికల్లాంటి స్పెషల్ ఫోర్సెస్ పారాకమాండోలను రంగంలోకి దించింది. మెరుపు వేగంతో కదులుతూ అత్యాధునిక ఆయుధాలను, పేలుడు పదార్థాలను అలవోకగా వినియోగించటంలో వీరు కఠోర శిక్షణ పొందారు. ఇప్పటికే బ్రిగేడ్ మొత్తాన్ని మోహరించింది. 

ముష్కరుల వద్ద విదేశీ ఆయుధాలు

ఇటీవల ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది వద్ద ఆస్ట్రియాలో తయారైన అత్యాధునిక స్టెయిర్ ఏయూజీ గన్‌ను సైన్యం స్వాధీనం చేసుకొన్నది. దీంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ అసాల్ట్ తుపాకులను ఆస్ట్రియా సైన్యం వాడుతున్నది. అంతటి కీలక ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎలా చిక్కాయన్నదానిపైనా నిఘా విభాగం దర్యాప్తు చేస్తోంది. ఆస్ట్రియా  స్టెయిర్ తుపాకులు ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తాయి. వీటికి మెయింటనెన్స్ కూడా పెద్దగా ఉండదు.

మ్యాన్యువల్ మోడ్‌తోపాటు ఆటోమెటిక్ మోడ్ కూడా వీటిలో ఉంటుంది. ఈ తుపాకులతో శత్రువలపై భీకరంగా విరుచుకుపడవచ్చు. ఇలాంటి తుపాకులు ఉగ్రవాదుల చేతుల్లో కనిపించటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. 1980 దశకంలో కూడా కశ్మీర్‌లో ఉగ్రవాదులు తొలిసారి ఏకే 47 తుపాకులు వాడటం మొదలుపెట్టి సామాన్య ప్రజలతోపాటు సైన్యంపై కూడా తీవ్ర దాడులు చేశారు. ఇప్పుడు మరోసారి ఇంకో ప్రమాదకరమైన కొత్త ఆయుధాలతో ముష్కరులు రావటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.