calender_icon.png 22 January, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారా సంబురం షురూ

29-08-2024 01:20:32 AM

  1. ఘనంగా పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలు
  2. పతాకధారులుగా సుమిత్, భాగ్యశ్రీ
  3. 22 క్రీడాంశాల్లో పోటీ పడనున్న 4400 మంది అథ్లెట్లు
  4. భారత్ నుంచి బరిలో 84 మంది అథ్లెట్లు

  5. సరిగ్గా నెల రోజుల క్రితం పారిస్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయింది. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడలకు పారిస్ నగరం వేదికైంది. ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల వ్యవధిలో ప్రఖ్యాత ఐఫిల్ టవర్ సాక్షిగా అదే నగరంలో మరో క్రీడా సంబురం మొదలైంది. అదిరే ప్రదర్శనలు.. అద్భుత విన్యాసాలు ఈసారి ఉండకపోవచ్చు.. కానీ సాధారణ అథ్లెట్లకు తామేం తక్కువ కాదన్నట్లు పారా అథ్లెట్లు పతకాల వేట కొనసాగించడానికి సిద్ధమయ్యారు. 

11 రోజుల పాటు జరగనున్న పారాలింపిక్స్‌లో అభిమానుల్లో స్పూర్తిని నింపడానికి.. ఆటలతో అలరించడానికి దివ్యాంగులు ఉత్సాహంతో ఉన్నారు. దీనికి తగ్గట్లే పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గత టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో సత్తా చాటిన మన పారా అథ్లెట్లు ఈసారి ఆ సంఖ్యను 25 చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆల్ ది బెస్ట్..!

విజయక్రాంతి ఖేల్ విభాగం: ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. గతానికి భిన్నంగా ఒలింపిక్స్ తరహాలోనే పారాలింపిక్స్ వేడుకలను స్టేడియం బయట నిర్వహించారు. ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌కు సమీపంలోని ప్లేస్ డి లా కాంకార్డ్‌లో ఆరం భ వేడుకలు జరిగాయి. ప్లేస్ డి లా కాంకార్డ్ నుంచి ఫ్రాన్స్ నగరంలో సెంటర్ సిటీ అయి న చాంప్స్ ఎలిసీస్ వరకు అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. వేడుకల్లో భారత్ నుంచి పతాకధారులుగా సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్‌లు జాతీయ జెండా చేబూనగా.. పారా అథ్లెట్లు వారి వెంట నడిచారు. నేడు పలు క్రీడాంశాల్లో పోటీలు ఉండడంతో చాలా మంది అథ్లెట్లు ప్రారంభోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 8న జరగనున్న ముగింపు వేడుకలకు ప్రఖ్యా త స్టేడ్ డి ఫ్రాన్స్  స్టేడియం వేదికగా నిలవనుంది. 11 రోజుల పాటు 22 క్రీడాంశాల్లో 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీ పడనున్నారు. 

10 కొత్త పతక ఈవెంట్లు..

ఒలింపిక్స్ జరిగిన ప్రాంతాల్లోనే చాలా వరకు పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించనున్నారు. అయితే అంధుల సాకర్ పోటీలు మాత్రం ఐపిల్ టవర్ సమీపంలో బీచ్ వాలీబాల్ నిర్వహించిన ప్రాంతంలో జరగనుంది. ఇక మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో 2020 టోక్యో పారాలింపిక్స్‌తో పోలి స్తే ఈసారి కొత్తగా 10 కొత్త పతక ఈవెంట్లను చేర్చారు.  నేపథ్యంలో పారిస్‌లో అరంగేట్రం చేయబోతున్న గోల్‌బాల్, బోచా ఆటలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ఎప్పటిలాగే చైనా ఈసారి పారాలింపిక్స్‌కు అత్యధి కంగా 282 మంది అథ్లెట్లను పంపుతోంది. టోక్యో పారాలింపిక్స్‌లో 96 స్వర్ణాలు సహా మొత్తంగా 207 పతకాలతో అగ్రస్థానంలో నిలిచిన చైనా అదే తరహాలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది.

25 పతకాలే లక్ష్యంగా..

పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో మన దేశం 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 25 పతకాలే లక్ష్యంగా పారా అథ్లెట్లు క్రీడలకు సిద్ధమయ్యారు. సుమిత్ అంటిల్ (ఎఫ్ 64 జావెలిన్ త్రో), కృష్ణ నగార్ (బ్యాడ్మింటన్), భవీనా పటేల్ (టేబుల్ టెన్నిస్, శీతల్ దేవీ (ఆర్చరీ), అవనీ లేఖరా (షూటింగ్), యోగేశ్ కతూనియా (డిస్కస్ త్రో), తంగవేలు మరియప్పన్ (హైజంప్), మనీష్ (షూటింగ్), సుహాస్ యతిరాజ్ (బ్యాడ్మింటన్)లపై భారీ అంచనాలున్నాయి.

సైక్లింగ్, రోయింగ్, జూడోలో భారత్ తొలిసారి పారా అథ్లెట్లను పంపించింది. 84 మంది అథ్లెట్లలో అత్యధికంగా అథ్లెటిక్స్ విభాగంలో 38 మంది పోటీ పడుతుండగా.. ఆ తర్వాత బ్యాడ్మింటన్ నుంచి 13, షూటింగ్ నుంచి 10 మంది పోటీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వరంగల్ అమ్మాయి దీప్తి జీవాంజి (400 మీటర్ల టీ20 ఈవెంట్), నంద్యాలకు చెందిన కొంగనపల్లి నారాయణ, షేక్ అర్షద్‌లతో పాటు షాట్‌పుట్‌లో రొంగలి రవితో షూటర్ రామకృష్ణ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.