తుర్కు (ఫిన్‌లాండ్): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పావో నుర్మీ గేమ్స్‌లో బరిలో దిగనున్నాడు. మంగళవారం ఫిన్‌లాండ్ వేదికగా ప్రారంభం కానున్న టోర్నీలో నీరజ్ జావెలిన్ త్రోలో సత్తా చాటాలనే పట్టదలతో ఉన్నాడు. భారత్ నుంచి నీరజ్ చోప్రా ఒక్కడే ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు. ఇదే టోర్నీ లో జర్మనీ టీనేజర్ మాక్స్ డెహనింగ్ నుంచి నీరజ్‌కు పోటీ ఎదురయ్యే అవకాశముంది.
మేలో స్వదేశంలో జరిగిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో నీరజ్ జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి పసిడి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పావో గేమ్స్ అనంతరం ఒలింపిక్స్‌కు ముందు జూలై 7న జరగనున్న ప్రతిష్ఠాత్మక పారిస్ డైమండ్ లీగ్‌లో నీరజ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా పారిస్ విశ్వక్రీడల్లో బరిసెను 90 మీటర్ల దూరం విసరడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు.