నాగర్‌కర్నూల్, జూలై 31 (విజయక్రాంతి): పాఠశాలలో ఉండే ఒకే ఒక ఉపాధ్యాయుడు సాధారణ బదిలీల్లో వెళ్లిపోవడంతో బడికి తాళం పడింది. ఉర్కొండ మండలం గుండ్లగుంటపల్లి పంచాయతీలోని ప్రాథమిక పాఠ శాల 12 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉన్న ఒకే ఒక్క ఉపాధ్యాయుడు రాంరెడ్డిపల్లికి బదిలీ కావడంతో నెల రోజులుగా ఆ పాఠశాలకు మరో పంతులు రాలేదు. దీంతో పాఠశాలకు తాళం పడింది. ఇందులో చదువుతున్న విద్యార్థుల్లో కొందరు ఇతర పాఠశాలలకు వెళ్తుండగా, మరి కొంతమంది ఇంటికే పరిమితం అవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు ఉపాధ్యా యుడిని కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.