calender_icon.png 6 October, 2024 | 5:52 AM

యజమానికే పంగనామం

05-10-2024 12:18:13 AM

రూ.30 లక్షలతో ఉడాయించిన ప్రబుద్ధుడు

24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): పనిచేస్తున్న సంస్థ యజమా నికే పంగనామం పెట్టి రూ.30 లక్షలతో పరారయ్యాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన రోహన్ కదమ్(20).. నగరంలోని సికింద్రాబాద్‌లో నివాసముంటూ నాలుగు రోజుల క్రితం పాట్ మార్కెట్‌లోని జ్యోతిర్లింగ్ రిఫైనింగ్‌లో పనిలో చేరాడు. 

గురువారం తన యజమాని 400 గ్రాముల బంగారాన్ని సికింద్రా బాద్‌లోని ఓ నగల దుకాణంలో అప్పగించి డబ్బు తీసుకురావాల్సిందిగా చెప్పాడు. యజమాని సూచించిన దుకాణంలో నగలు అప్పగించి రూ.30 లక్షల నగదు తీసుకున్న రోహన్.. ఆ డబ్బును యజమానికి అప్పగించకుండా తన పరిచయస్తులైన ముజమ్మిల్ బలిగార్, పృథ్వీరాజ్ సాలుంఖే, ప్రసాద్‌తో కలిసి కారులో ఉడాయించారు.

విషయం తెలుసుకున్న యజమాని మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు.. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సహాయంతో నిందితులు బెం గుళూరు వైపు వెళ్తున్నారనే విషయాన్ని గుర్తించి బెంగుళూరు సమీపంలో కారులో వెళ్తున్న రోహన్ కదమ్, ముజమ్మిల్ బలిగర్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

వారి నుంచి రూ.29.92 లక్షల నగదు, మారుతి స్విఫ్ట్ కారు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులను నార్త్‌జోన్ డీసీపీ రష్మీపెరుమాళ్ అభినందించారు.