calender_icon.png 26 October, 2024 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పాండ్యా @ 1

04-07-2024 12:48:27 AM

  • ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
  • మెరుగైన ర్యాంక్‌లో బుమ్రా

దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో పాండ్యా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 222 పాయింట్లు కలిగిన పాండ్యా శ్రీలంక కెప్టెన్ వనిండు హసరంగ (222 పాయింట్లు)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. టీమిండియా తరపున టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన తొలి ఆల్‌రౌండర్‌గా పాండ్యా చరిత్ర సృష్టించాడు.

ఇక మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), సికందర్ రజా (జింబాబ్వే), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఒక్కో స్థానం మెరుగుపరుచుకొని వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. టీ20 ప్రపంచకప్‌లో అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో అదరగొట్టిన పాండ్యా టీమిండియా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో పాండ్యా బ్యాటింగ్‌లో 150కి పైగా స్ట్రుక్‌రేట్‌తో 144 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు.

ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో మూడు వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తీవ్ర ఒత్తిడిలో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి 16 పరుగులకు గానూ 9 పరుగులే ఇచ్చి టీమిండియాకు రెండోసారి వరల్డ్ కప్ అందించాడు.

బూమ్రా అదుర్స్

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ర్యాంకింగ్స్‌లో ఏకంగా 12 స్థానాలు ఎగబాకిన బుమ్రా 12వ స్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసి15 వికెట్లతో సత్తా చాటిన బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు సైతం కైవసం చేసుకున్నాడు. మెగాటోర్నీలో భారత్‌కు వికెట్ అవసరమైన సందర్భాల్లో ఆపద్బాంధవుడి పాత్ర పోషించిన బుమ్రా కీలకమైన ఫైనల్లోనూ రెండు వికెట్లు తీసి టీమిండియా పొట్టికప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ (718 పాయింట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దక్షిణాఫ్రికా పేసర్  నోర్జే ఏడు స్థానాలు ఎగబాకి 675 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకులో నిలవగా.. హసరంగ (శ్రీలంక) మూడో స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి అక్షర్ పటేల్ (7వ స్థానం), కుల్దీప్ యాదవ్ (9వ స్థానం) టాప్‌వా చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం మార్పులు లేవు. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, టీమిండియా స్టార్ సూర్యకుమార్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఎంతలో ఎంత మార్పు..

మొన్నటి వరకు అతడు మైదానంలో కనిపిస్తే.. వెక్కిరించిన అభిమానులే.. ఇప్పుడు అతడే మా హీరో అని నెత్తిన మోస్తున్నారు. మంచి జట్టును తన ఈగోతో నాశనం చేశాడని నిందించినవాళ్లే.. ముఖ్యమైన టోర్నీల్లో అతడే భారత జట్టు మూలాధారం అని వేనోళ్ల కొనియాడుతున్నారు. నెల రోజుల క్రితం టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అసలు జట్టులో అతడు అవసరమా అని విమర్శలు ఎదుర్కొన్న.. ఆ ప్లేయర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా! అదేనండీ పేస్ ఆల్‌రౌండర్ హార్దీక్ పాండ్యా.

ఐపీఎల్లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపిన అదే పాండ్యా.. ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు ముంబై జట్టుకు మారాడు. ఈ బదిలీ అంత సజావుగా సాగలేదు. సారథ్య బాధ్యతలు అప్పగిస్తేనే పాండ్యా ముంబైకి వస్తానని మెలిక పెట్టినట్లు ప్రచారం జరగగా.. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని టీమ్ మేనేజ్‌మెంట్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.

దీంతో ముంబై విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కినుకు వహించారు. దీనికి తోడు ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆటగాళ్ల మధ్య విబేధాలే అందుకు కారణమనే ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ పాండ్యా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ పోరాటమే ఊపిరిగా ముందుకు సాగిన పాండ్యా.. పరాజయాన్ని అంగీకరించేందుక ఒప్పుకోలేదు. 

‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవలి’ అన్న చందంగా.. మైదానంలో అటు బంతితో ఇటు బ్యాట్‌తో చెలరేగిపోయిన పాండ్యా.. టీమిండియా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ఓపెనర్‌గా ప్రమోషన్ పొందడంతో.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా.. అవసరమైనప్పుడల్లా విలువైన పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో పెద్దగా బౌలింగ్ చేయని పాండ్యా.. మెగాటోర్నీలో స్పెషలిస్ట్ బౌలర్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా కనిపించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను ఈ సారి హార్దిక్ నిర్వర్తించాడనడంలో సందేహమే లేదు.

ఫైనల్ మినహా వరల్డ్‌కప్ మొత్తం కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయినా.. ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకోవడంలో రోహిత్, పంత్, సూర్యతో పాటు పాండ్యా పాత్ర కూడా కీలకం. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ ఫైట్‌లోనైతే.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య పాండ్యా అత్యద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. సఫారీ జట్టు విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు అవసరమైన దశలో సిక్సర్ల వీరుడు హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేసిన హార్దిక్.. చివరి ఓవర్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు.

కపిల్‌దేవ్ తర్వాత జట్టుకు అంతటి పేస్ ఆల్‌రౌండర్ లభించలేదనే వాళ్లకు తానున్నానని సమాధానం చెప్పిన పాండ్యా.. నెల రోజులకు ముందు తనపై విమర్శలు చేసిన వారితోనే ప్రశంసలు అందుకున్నాడు. రోహిత్, కోహ్లీ టీ20 పార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇకపై యంగ్‌ఇండియాకు మార్గనిర్దేశకుడిగా నిలవాల్సిన గురుతర బాధ్యత కూడా పాండ్యాపై ఉంది. ఆటగాడిగా సక్సెస్ అయిన హార్దిక్.. భవిష్యత్తులో కెప్టెన్‌గానూ అదే బాటలో నడవాలని ఆశిద్దాం. 

 విజయక్రాంతి, ఖేల్‌విభాగం