calender_icon.png 20 November, 2024 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో పంద్రాగస్టు పంచాయితీ

14-08-2024 03:32:33 AM

  1. జెండా ఎగురవేసేది హోంమంత్రి కైలాశ్ గెహ్లాట్ 
  2. నామినేట్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్న నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికారికంగా జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే ప్రశ్నకు తెరపడింది. దేశ రాజధాని ఢిల్లీలో జెండావిష్కరణకు హోంమంత్రి కైలాశ్ గెహ్లాట్ పేరును లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేశారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్‌కుమార్‌కు ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా లేఖ రాశారు. ఢిల్లీ హోంమంత్రి కైలాశ్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు.

అంతకుముందు జెండావిష్కరణ అవకాశాన్ని మంత్రి అతిశీకి ఇవ్వాలని కేజ్రీవాల్ చేసిన సూచనపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసే అవకాశాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేమని తెలిపింది. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు నిర్దేశిత విధానం ఉంటుందని, ఆ నిబంధనలు పాటించకుండా ఆమెకు బాధ్యతలు అప్పగించలేమని తెలిపింది.

ఇది వేడుకల పవిత్రతను దెబ్బ తీస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బదులుగా అతిశీ జెండావిష్కరణ చేస్తారని ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాశారు.