- వాగును ఆనుకొని బహుళ అంతస్తుల నిర్మాణాలు
- క్రమంగా కుచించుకుపోతున్న నీటికాల్వ
- బిల్డర్లకు జీ హుజూర్ అంటున్న అధికారులు
- భారీగా ముడుపుల అందయని విమర్శలు
రాజేంద్రనగర్, నవంబర్14: చారిత్రక నేపథ్యమున్న పందెంవాగు క్రమంగా తన ప్రాభవం కోల్పోతుంది. వాగును ఆనుకొని ఇరువైపులా అడ్డగోలుగా అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్ర మార్కులపై చర్యలు తీసుకోవాల్సిన మణికొండ మున్సిపాలిటీ అధికారులు అందిన కాడికి ముడుపులు తీసుకొని సైలెంట్‌గా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
కోట్లు గడిస్తున్న బిల్డర్లు
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పందెంవాగు ప్రవహిస్తోంది. గతంలో బాగా వెడల్పుగా ఉన్న ఈ వాగు ఆక్రమణలతో కుంచించుకుపోయింది. ఇప్పటికే చాలామంది వాగును ఆనుకొని ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం మణికొండ మున్సిపల్ పరిధిలోని తిరుమల హిల్స్, వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతా ల్లో చాలా మంది బిల్డర్లు అనుమతులు లేకుండా అడ్డగోలుగా వాగుకు ఆనుకొని బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు.
నిబంధనల ప్రకారం వాగును ఆను కొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. అయి తే, మున్సిపల్ అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పడంతో బిల్డర్లకు అడ్డుఅ దుపూ లేకుండా పోతోంది. అడ్డగోలుగా, సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు చేపడుతూ కోట్లు గడిస్తున్నారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన మున్సిపల్ యంత్రాంగం కండ్లు మూసుకొని అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మణికొండ మున్సిపల్ పరిధిలో పందెంవాగుకు ఆనుకొని అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని.. హైడ్రా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మణికొండవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్పందించని మున్సిపల్ కమిషనర్
పందెంవాగు ఇరువైపుల కొనసాగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాల విషయమై వివరణ కోరేందుకు పలుమార్లు మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్‌కు చరవాణిలో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఇరిగేషన్ ఏఈ నుంచి కూడా స్పందన కరువైంది.