మంథని: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం రెండు పందెం కోళ్లకు వేలంపాట నిర్వహించారు. గత నెల 27వ తేదీన మండలంలోని పెంచికల్ పేట గ్రామంలో కోళ్ల పందెం ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఈ మేరకు మంథని కోర్టు ఆదేశాలతో మంగళవారం స్టేషన్ ఆవరణలో ఆ రెండు పందెం కోళ్లకు వేలంపాట నిర్వహించగా, మొదట ఒక పందెంకోడి (2.98 కిలోలు )కి కమాన్ పూర్ కు చెందిన పురాణం సారయ్య అనే వ్యక్తి రూ.4 వేల గరిష్టానికి పాడి దక్కించుకున్నాడు. మరో కోడి (2.410 కిలో గ్రా)ని కమాన్ పూర్ కి చెందిన బోనాల సత్తయ్య రూ.2500 గరిష్టంకు వేలంపాట ద్వారా దక్కించుకున్నాడు. కాగా, ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులను మంథని కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు ఎస్సై మామిడాల చంద్రశేఖర్ తెలిపారు.