అతిథి అధ్యాపకులకు 4 నెలలు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు 3 నెలల వేతనాలు పెండింగ్
జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు అందని జీతాలు
ఆవేదనలో రెండు వేలకుపైగా కుటుంబాలు
హైదరాబాద్/కామారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే అతిథి (గెస్ట్) లెక్చరర్లు, కాంట్రాక్ట్ అధ్యపకుల పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదో నెల కావొస్తున్నా ఇంతవరకు ఒక నెల వేతనం కూడా రాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే, పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అధ్యాపకులు వాపోతున్నారు. రాష్ట్రంలోని 423 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు, 460 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతినెలా వేతనాల కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి. అర్ధాకలితో విద్యాబోధన సాగిస్తున్నారు.
దసరా పండగకు అందరూ వారం రోజుల ముందు నుంచే తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు కొంటుంటే.. వీరు మాత్రం తమకు జీతాలు ఈరోజు వస్తాయా..రేపు వస్తాయా! అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంతకు జీతాలు రాకపోవడంతో ఈ పండక్కు పస్తులుండాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో భార్యాపిల్లలతో పండుగెలా జరుపుకోవాల ని దాదాపు 2వేలకు పైగా లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు అంతంతే..
2012తో కాంట్రాక్ట్ లెక్చరర్ల రిక్రూట్‌మెంట్ ఆపేశారు. దీంతో ఖాళీలు ఏర్పడ్డా యి. లెక్చరర్ల కొరత ఉండటంతో ఆ స్థానా ల్లో పీరియడ్ విధానంలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్ల విధానం కాకుండా నూతనంగా ‘గెస్ట్’ అనే కొత్త పేరును ప్రవేశపెట్టి 2013లో విధుల్లో తీసుకున్నారు. గత 11 సంవత్సరాలుగా గెస్ట్ లెక్చరర్లుగా వీరు పనిచేస్తున్నారు.
ఇందులో అతిథి అధ్యాపకులు త్రిసభ్య కమిటీ ద్వారా ఓపెన్ పేపర్ నోటిఫికేషన్ ప్రకారం పీజీ మెరిట్, డెమో, ఇంటర్వ్యూ, బోధనలో అనుభవం ద్వారా ఎంపికై రెగ్యూలర్ లెక్చరర్లకు సమానంగా బోధిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ, సమాన పనికి సమాన వేతనం మాత్రం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో పేపర్ వాల్యుయేషన్ విధుల్లో పాల్గొన్నా ఎలాంటి అదనపు వేతనాలు ఇవ్వడం లేదు. గెస్ట్ లెక్చరర్లకు గరి ష్ఠంగా 72 పీరియడ్లు ఉంటాయి. పీరియడ్ కు రూ.300 నుంచి 390కి పెంచగా 72 పీరియడ్లకు గానూ.. నెలకు రూ.28,080 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఇది కూడా ఏ నెలకు ఆ నెలా చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు.
కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి అంతే...
జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయగా దాదాపు 460 మంది ఇంకా మిగిలిపోయారు. వీరికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వేతనాలు రావాలి. వీరు దాదాపు 13, 14 ఏండ్లుగా పనిచేస్తున్నారు. గెస్ట్ లెక్చరర్లతో పోల్చుకుంటే వీరికి వేతనాలు కాస్త ఎక్కువే. నెలకు రూ.54,220 చెల్లిస్తారు. కానీ మూడు నెలల నుంచి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 3వేల మందికిపైగా కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం తమను కూడా రెగ్యులర్ చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు.
వేతన పెంపు ఎప్పుడు?
2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో లో గెస్ట్ లెక్చరర్లకు రూ.42 వేల వేతనం చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చారు. ఈ అంశా న్ని గెస్ట్ లెక్చరర్ల సంఘం నేతలు పలుమార్లు మంత్రులు శ్రీధర్‌బాబు, దామో దర రాజనర్సింహ, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరికొందరు మంత్రులు, ప్రజాప్రతినిధు లను సైతం కలిసి సంఘం తరఫున వినతిపత్రాలు అందిచారు.
వేతనాలు పొందేది ఆరేడు నెలలే..
గెస్ట్ లెక్చరర్లు పని చేసిన రోజుకే వేతనం చెల్లిస్తారు. పీరియడ్ విధానంలో పనిచేస్తున్న కారణంగా.. ఆదివారం, రెండో శనివారం, బందులు, సెలవులు, దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు వచ్చే సెలవుల్లో ఇంటర్ కాలేజీల లో పనిచేస్తున్న అందరికీ వేతనాలు వస్తాయి. కానీ గెస్ట్ లెక్చరర్లు మాత్రం పండుగ పూట కూడా సెలవులెందుకు వచ్చాయని వేదన పడాల్సి వస్తుంది.
ఆ నెలల్లో తక్కువ వర్కింగ్ డేస్ ఉండటం వల్ల పూర్తి వేతనం వారికి అందదు. అంతేకాకుండా ప్రతీ సంవత్సరం సరైన సమయానికి ‘రెన్యూవల్’ (కంటిన్యూయేషన్) ఇవ్వరు. గెస్ట్ లెక్చరర్లు వాస్తవానికి జూన్ 1వ తేదీ నుంచి అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే వరకు పనిచేస్తారు. జూన్ నుంచి మార్చి వరకు గరిష్ఠంగా 10 నెలలు మాత్రమే బడ్జెట్ కేటాయించి అప్పటివరకు మాత్రమే వీరికి వేతనం చెల్లిస్తారు.
అందులోనూ జూన్‌లో రావాల్సిన రెన్యూవల్ కాస్తా.. ఆగస్టు, సెప్టెంబర్ నెల వరకు రాకపోవడంతో 10 నెలల్లో 6 లేదా 7 నెలలు మాత్రమే వేతనాలు పొందుతున్నారు. రెన్యూవల్ ఆలస్యంగా ఇవ్వడం వల్ల దాదాపు 3 నుండి 4 నెలల వేతనాల్లో కోత ఏర్పడుతోంది.
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నాలుగు నెలలకు సంబంధించిన వేతనాలు ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం అక్టోబర్ నెల ముగుస్తున్నా జీతం డబ్బులు ఇవ్వకపో వడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే తక్కువ వేతనంతో కుటుంబ పోషణ భారం అవుతుంది. పండుగలప్పుడు పస్తు లుండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అందరూ సంతోషంగా ఉంటే మేం మాత్రం బాధ పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా పెండింగ్ జీతాలను త్వరగా విడుదల చేయాలి.
దామెర ప్రభాకర్, గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి
జూనియర్ కాలేజీల్లో 11 ఏండ్లుగా చాలిచాలని వేతనాలతో రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గెస్ట్ లెక్చరర్లను ఎంటీఎస్‌గా మార్చి మా కుటుంబాలను ఆదుకోవాలి. కొత్తగా 1,392 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమిస్తున్న క్రమంలో అదనపు పోస్టులు మంజూరు చేసైనా లేదా.. సూపర్ న్యూ మరరీ పోస్టులు క్రియేట్ చేసైనా 11 ఏండ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాలు పోకుండా న్యాయం చేయాలి.
దార్ల భాస్కర్, గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి