calender_icon.png 19 February, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టం 1,5౦౦ కోట్లు

16-02-2025 12:22:50 AM

  1. పంచాయతీలకు పాలకమండళ్లు లేవు.. సర్పంచ్‌లు లేరు! 
  2. ఏడాది కాలంగా నిలిచిన కేంద్రం గ్రాంట్లు 
  3. 2024-25లో గ్రామాలకు రూ. 1,514 కోట్లు కేటాయింపు
  4. 2026 మార్చి 31తో ముగియనున్న 15వ ఆర్థిక సంఘం గడువు
  5. ఏపీకి ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధులు రూ. 2,109 కోట్లు విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాం తి): పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాష్ట్రం కోల్పోతున్నది. ఈ ఏడాది పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.1,514 కోట్లను కేంద్రం కేటాయించింది. అయితే సంవత్సరకాలంగా పంచా యతీలకు సర్పంచ్‌లు లేరు.

పాలకమండళ్లు లేకపోవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలకు కేటాయించిన రూ. 1,514 కోట్లలో రాష్ట్రానికి ఇప్పటి వరకు నయాపైసా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన ఏపీకి ఈ ఏడాది కేంద్రం రూ.2,152 కోట్లను కేటాయించగా.. ఫిబ్రవరి ౭ నాటికి రూ. 2,109 కోట్లను విడుదల చేసింది. అలాగే, మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకకు రూ.1,120 కోట్ల ను రిలీజ్ చేసింది.

నిధులను కోల్పోవాల్సి వస్తుందన్న కారణంతోనే ప్రభుత్వం మార్చి 10 నాటికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తొలుత అనుకున్నది. కానీ కొన్ని రాజకీయ, సామాజిక పరిస్థితుల వల్ల ఎన్నికలను నిర్వహణను వాయిదా వేసింది. దీంతో ఈ ఏడాది కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులపై సందిగ్ధత నెలకొంది. 

గతేడాది కూడా తగ్గిన గ్రాంట్లు.. 

సర్పంచ్‌ల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి ౨ తో ముగిసింది. అప్పటినుంచి పంచాయతీలకు పాలకమండళ్లు లేవు. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే ప్రత్యేకాధికారుల పాలన నడిచింది. అంతకుముందు సర్పంచ్‌లు ఉన్న నేపథ్యంలో గతేడాది రాష్ట్రానికి కేటాయించిన నిధులను కేంద్రం కేటాయించింది.

చివరి రెండు నెలలు ప్రత్యేక అధికారుల ఉన్నందున రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. అందుకే గతేడాది ఆర్థిక సంఘం నిధులు రూ.1,430 కోట్లను కేటాయిస్తే.. కేంద్రం 6 కోట్లను తగ్గించింది.

2024 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేరు. ఈ ఏడాది పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల కింద రూ.1,514 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో పాలకమండళ్లు లేకపోవడంతో ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదు.

మార్చి 31లోపు నిర్వహిస్తే.. 

దేశంలో ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నడుస్తోంది. ఈ ఆర్థిక సంఘం 2021-26 వరకు ఉంటుంది. ఈ ఐదేళ్ల కాలానికి  పంచాయతీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కోసం కేంద్రం రూ. 2,36,805 కోట్లను కేటాయించింది. అందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఢిల్లీ మినహా మిగిలిన 28 రాష్ట్రాలకు రూ. 60,750 కోట్లను కేటాయించింది.

వీటిలో తెలంగాణకు రూ. 1,514 కోట్లను ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర  ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆదాయం తగ్గింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఈ గ్రాంట్ వస్తే కొంతైనా ఆసరా అవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31లోగా పాలకమండళ్లు ఏర్పడితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని రేవంత్ రెడ్డి సర్కారు భావించింది. తద్వారా ఖజానాకు కొంతైనా ఆసరా అవుతుందని అనుకున్నది. కాని అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

కేంద్రం సహకరిస్తుందా?

స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదలచేయాలని 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పాలకమండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. 15వ ఆర్థిక సంఘం గడువు కూడా వచ్చే మార్చితో ముగిస్తుంది.

దీంతో ఈ ఏడాది కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల.. వాటిని వచ్చే ఏడాదికి కేంద్రం బదిలీ చేస్తుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఏడాది కేటాయించిన నిధులు నిలిచిపోతే.. తర్వాత ఏడాదికి బదిలీ చేసే వెసులుబాటు కేంద్రానికి ఉంటుంది. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం ఈ మేరకు సహకరిస్తుందా? అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.