calender_icon.png 23 January, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

07-12-2024 02:48:29 AM

రూ.15వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

సంగారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి):  సంగారెడ్డి జిల్లాలోని కల్హేరా మండలంలోని మహదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సి.ఉమేశ్ రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాసాన్‌పల్లి గ్రామంలో చేపల స్టాల్ ఏర్పాటు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోనేందుకు ఓ వ్యక్తికి ధ్రువీకణ పత్రం ఇచ్చేందుకు గాను లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఉమేశ్ పై సదరు వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలో శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శి ఉమేశ్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉమేశ్‌ను అరెస్టు చేసిన అధికారులు హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇదే విషయమై పంచాయతీ కార్యద్శుల అక్రమాలు పెరిగిపోతున్నాయని నవంబర్ 24న విజయక్రాంతి దినపత్రికలో ‘చేయి తడిపితేనే అనుమతులు’ అనే శీర్షికతో వార్త రావడం జరిగింది.

తాజా ఘటనతో జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. కాగా లంచం తీసుకుంటూ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతోపాటు కిందిస్థాయి సిబ్బంది వరకు ఏసీబీ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని ఏదో ఒకచోట రెండుమూడు రోజులకు ఒకరు ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నా అధికారుల్లో మార్పు రావడం లేదు.