calender_icon.png 21 January, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీల్లో కార్యదర్శులు సతమతం!

03-07-2024 12:31:25 AM

  • పని, ఆర్థిక భారంతో అవస్థలు 
  • అప్పులు తెచ్చి జీపీల నిర్వహణ 
  • పెండింగ్‌లోనే అన్ని రకాల బిల్లులు 
  • పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్లు 

మెదక్, జూలై 2 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం. జీపీలను ఆదర్శంగా, హరిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న కార్యదర్శుల బతుకులు మాత్రం భారంగా మారాయి. ప్రధానంగా వారికి ఆర్థిక పరమైన అంశాలు అప్పగించడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనవరి 30తో గ్రామాల్లో సర్పంచ్‌ల పాలన పూర్తయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు ఫిబ్రవరి 1 నుంచి పాలన బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా స్పెషల్ ఆఫీసర్లు నామమాత్రంగా విధులు నిర్వర్తించడంతో కార్యదర్శులపైనే పని భారం పడుతోంది. ఆపై బిల్లులన్నీ పెండింగ్‌లో ఉండడంతో వారికి తలనొప్పిగా మారింది. 

జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు..

మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా నలుగురు గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులు, ముగ్గురు గ్రేడ్ కార్యదర్శులు, 64 మంది గ్రేడ్ కార్యదర్శులు, 333 మంది గ్రేడ్ కార్యదర్శులు, 25 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 48 మంది ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. కాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్‌ఎఫ్‌సీ), 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడి గ్రామ పంచాయతీ పాలన నడుస్తోంది. అయితే 2022 ఆగస్టు నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు మంజూరు కాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంతో ఆర్థిక భారం పడి అప్పుల పాలవుతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బిల్లులు రాక..

గ్రామ పంచాయతీ సిబ్బందికి సుమారు ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో వారు కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. మాజీ సర్పంచ్‌లు పెండింగ్ బిల్లుల మంజూరుపై ఒత్తిడి చేస్తున్నారు. గ్రామాల్లో సీసీ ఛార్జీలు, ట్రాక్టర్ల ఈఎంఐలు పెండింగ్‌లోనే ఉన్నాయి. 

కార్యదర్శుల తంటాలు..

మిషన్ భగీరథ నీరు సరఫరా ఉండడం లేదని ఎండాకాలంలో ప్రజలు కార్యదర్శులపై ఒత్తిడి తేవడంతో ప్రతి పంచాయతీలో బోర్లు వేయించడం, పాడైన వాటికి రిపేర్లు చేయించడం వటి పనులు చేపట్టారు. నీటి ఎద్దడి లేకుండా అన్ని పనులు చేశారు. నర్సరీల ఏర్పాటు కోసం మట్టి తోలించడం, విత్తనాలు, ఫర్టిలైజర్స్, గ్రీన్ షెడ్ వంటివి కార్యదర్శులే తెప్పించారు. ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు, శానిటేషన్ పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, దోమల నివారణకు ఫాగింగ్ చేయించడం, వాటర్ లీకేజీల మరమ్మతులు, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర అనేక సమస్యలతో తమపై ఆర్థిక భారం పడుతోందని కార్యదర్శులు వాపోతున్నారు. 

పేరుకే స్పెషల్ ఆఫీసర్లు.. 

సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లుగా గెజిటెడ్ అధికారులకు ఫిబ్రవరి 1 నుంచి బాధ్యతలు అప్పగించారు. అయితే వారు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ భారం కూడా కార్యదర్శులపైనే పడుతోంది. బిల్లులు వస్తే స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంది. ఇప్పటికైనా కార్యదర్శులు ఖర్చు పెట్టిన డబ్బులు వెంటనే ఇవ్వాలని, పెండింగ్ బిల్లులతో పాటు జీపీ సిబ్బంది బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. 

పెట్టిన పెట్టుబడి ఇవ్వాలి..

గ్రామ పాలనకు ఆటంకం కలగొద్దని ఒక్కో కార్యదర్శి గ్రామ పంచాయతీ అవసరాల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసి కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించాలి. 

 సంతోష్, తెలంగాణ పంచాయతీ 

సెక్రటరీ ఫెడరేషన్ (టీపీఎస్‌ఎఫ్) అధ్యక్షుడు, మెదక్

ఆర్థిక భారం పడకుండా చూడాలి..

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సమస్యలు పరిష్కరిస్తున్నాం. కార్యదర్శులపై పని భారంతో పాటు ఆర్థిక భారం మోపడం సరికాదు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలి.

 సందిల బలరాం, టీపీఎస్‌ఎఫ్ 

అసోసియేట్ అధ్యక్షుడు, సంగారెడ్డి