రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
అలంపూర్, నవంబర్ 18: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో పంచాయతీ రాజ్ ఏఈగా పని చేస్తున్న పాండురంగారావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని రాజశ్రీ గార్లపాడు గ్రామంలో రూ.35 లక్షల నిధులతో మైనార్టీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టారు.
నిర్మాణం పూర్తయ్యి ఆరు నెలలు గడుస్తున్నా బిల్లులు కాకపోవడంతో పంచాయతీ రాజ్ ఏఈ పాండు రంగారావును కాంట్రాక్టర్లు మహ్మద్ హుస్సెన్, జగదీశ్వర్‌రెడ్డి, లాలు లక్ష్మినారా యణ కలిసి బిల్లులు మంజూరు చేయాలని చాలాసార్లు కోరారు. రూ.లక్ష ఇస్తే తప్ప బిల్లులు మంజూరు చేయనని ఏఈ చెప్పడంతో రూ.50 వేలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
ఈ విషయాన్ని కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారి సూచనల ప్రకారంగా పాండురంగారావుకు సోమవారం ఎర్రవెల్లి చౌరస్తాలోని ఓ షాపులో నగదును అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.