- ఒకే ఆవరణలో ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులు
- బీఆర్‌ఎస్ కార్యాలయం అక్రమమంటూ అధికారులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
- నోటీసులిచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు
హనుమకొండ, జూలై 2(విజయక్రాంతి): హనుమకొండలో ఆఫీసుల పంచాయితీ నడుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాయాలను బాలసముద్రంలోని ఒకే ఆవరణ లో ఏర్పాటు చేశారు. అప్పటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ చొరవతో ఈ కార్యాలయాలు నిర్మించారు. అయితే ఇటీవల ఎన్నికల్లో పశ్చిమ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్‌భాస్కర్ ఓడిపోయి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి గెలుపొందారు.
దీంతో బీఆర్‌ఎస్ కార్యాలయమున్న ఆవరణలోని క్యాంపు కార్యాలయంలోనే ఎమ్మెల్యే నాయిని ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చే కాంగ్రెస్ శ్రేణులకు, బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు వచ్చే కార్యకర్తలకు తరచూ ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. దీంతో అక్కడ పోలీసులు రెండు కార్యాలయాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వివాదంలో బీఆర్‌ఎస్ ఆఫీస్
హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయం సుమారు ఎకరం స్థలంలో నిర్మిం చారు. ఖరీదైన ఏరియాలోని విలువైన స్థలాన్ని బీఆర్‌ఎస్ పార్టీ అక్రమంగా కబ్జా చేసిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే నాయిని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏ ప్రాతిపదికన పార్టీ ఆఫీస్ నిర్మాణం చేశారో చెప్పాలంటూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్‌కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా ఆ పార్టీ నేతల నుంచి సరైన వివరణ రాలేదని తెలుస్తోంది.
దీంతో అక్రమంగా నిర్మించారన్న కారణాలతో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సమాచారం బీఆర్‌ఎస్ నాయకులకు లీకైనట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ చర్యను ఎలాగైనా ఎదుర్కొవాలని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నట్లు సమా చారం. అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి.