calender_icon.png 21 November, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరిలో పంచాయతీ ఎన్నికలు?

21-11-2024 01:49:26 AM

రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

  1. డిసెంబర్‌లో షెడ్యూల్ విడుదలకు అవకాశం
  2. మూడు దశల్లో నిర్వహించేందుకు కార్యాచరణ! 
  3. బీసీల రిజర్వేషన్‌పై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఆ సమయంలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచించినప్పటికీ బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి రావడంతో మళ్లీ జాప్యం జరిగింది. 2024 ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. కాగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రభుత్వం వేగం పెంచింది.

పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవుతున్న క్రమంలో వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తద్వారా గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

జనవరిలో మూడుదశల్లో?

ప్రభుత్వం జనవరిలో ‘పంచాయతీ’ ఎన్నికలను నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అయితే ఈసారి పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా జనవరిలోనే 15వ తేదీ తర్వాత మూడు దశల ఎన్నికలను ముగించనున్నట్టు సమాచారం. 

బీసీల రిజర్వేషన్లపై కసరత్తు..

పంచాయతీ ఎన్నికలు వాయిదా పడటానికి స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తేలకపోవడం కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై త్వరలో కసరత్తు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపడుతున్న విషయం తెలిసిందే.

ఈ ప్రక్రియ పూర్తి కావస్తుండటంతో ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించే రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కులగణనతో రాష్ట్రంలోని బీసీల జనాభా లెక్క తేలనున్నది. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తేల్చడానికి నియమించిన డెడికేటెడ్, బీసీ కమిషన్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ విచారణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.

కులగణన సర్వే, డెడికేటెడ్, బీసీ కమిషన్‌ల బహిరంగ విచారణ పూర్తి కావడంతో బీసీల సమస్య కొలిక్కి వస్తుందని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు అడ్డంకులు తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. 

పోటీకి అర్హతలు..

* ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే సర్పంచ్/వార్డు అభ్యర్థి పోటీకి అనర్హులు.

* 1995 జూన్ 1వ తేదీ తర్వాత మూడో సంతానం ఉండరాదు.

* ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు సంతానం పుడితే వారు పోటీలో పాల్గొనవచ్చు.

* పోటీకి కనీస వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

* పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.

* వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు కూడా అదే వార్డు/గ్రామంలో ఓటరు అయి ఉండాలి.

* స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీ చేయడానికి అవకాశం లేదు.

* దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థలోని వారు పోటీకి అనర్హులు.

* ప్రభుత్వ ఉద్యోగులైతే రాజీనామా చేసి ధృవీకరణను నామినేషన్ల పరిశీలన లోపు ఇచ్చిన వారు పోటీకి అర్హులవుతారు.