వేద విజ్ఞానం
పంచకోశాల వివరణ ‘తైత్తిరీయోపనిషత్తు’లోని బ్రహ్మానంద వల్లిలో ఉంది. హృదయాకాశంలో ఉండే ఆత్మ, స్థూలమైన శరీరం కంటే వేరైంది, విలక్షణమైంది. అయితే, ఈ ఆత్మ అయిదు కోశాల లోపల నిక్షిప్తమై ఉంది. అంటే, అయిదు కోశాలతో కప్పబడి ఉందన్నమాట. అవి వరసగా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, అనందమయ కోశం.
కత్తిని ఒర కప్పినట్లే ఈ కోశాలు ఆత్మని కప్పుతున్నాయి. అందువల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేక పోతున్నాం. ఆత్మ ఆనందమయ కోశంలో ప్రతిష్ఠితమై ఉంది. ఉల్లిపాయను చూసే ఉంటారు - ఛాందసులు కూడ. దాని నిర్మాణం లాంటిదే ఈ కోశాలు. ఉల్లిపాయలో పైపొర లోపలి పాయను కప్పినట్లే, ఈ కోశాలన్నీ ఆత్మను కప్పివేసి మనకి ఈ శరీరమే ఆత్మ అనే భ్రమను కలిగిస్తున్నాయి.
మొదటిదైన అన్నమయ కోశం అన్నంతో నిర్మితమైన శరీరం, దాని శక్తి స్థూలమైంది. పైకోశం నుండి లోని కోశాల లోనికి వెళ్ళిన కొద్దీ పై కోశం కంటే లోని కోశం సూక్ష్మంగా ఉంటుంది. రెండవది ప్రాణమయ కోశం. శరీర వ్యాపారాన్ని నిర్వహించే పంచప్రాణాలు ఈ కోశంలోనే ఉంటాయి. మూడవది మనోమయ కోశం. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన భోగట్టామీద విచారణ చేస్తుంది. సంకల్ప వికల్పాలు దీని లక్షణం. ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నాల్గవది విజ్ఞానమయ కోశం.- దీనిలో ఉండేది బుద్ధి. మనస్సు నివేదించిన విషయం మీద నిర్ణయం చేస్తుంది. నిర్ణయాత్మక శక్తి బుద్ధి. అయిదవది ఆనందమయ కోశం. దీనిలో ఉండేదే ‘ఆనందం’- మనం సుషుప్తిలో అనుభవించే ఆనందం ఇదే. అన్ని కోశాలకంటే సూక్ష్మాతి సూక్ష్మమైన కోశం ఇదే.
ఇందులోనే ఆత్మ ప్రతిష్ఠితమై ఉంది. ఆత్మనే ఆనందంగా అభివర్ణించిందీ ఉపనిషత్తు. పై కోశం నుండి లోని కోశానికి పోయే క్రమంలో ఉపనిషత్తు మనల్ని స్థూలం నుండి, సూక్ష్మానికి, సూక్ష్మాతరానికి, సూక్ష్మతమానికి, సూక్ష్మాతి సూక్ష్మానికి తీసుకు వెళుతుంది. ఆత్మ ఎప్పుడూ మనలో ఉండేదే అయినా ఈ కోశాలు దాని అస్తిత్వాన్ని మనం గుర్తించ లేకుండా చేస్తున్నాయి. అవి మనని పూర్తిగా అజ్ఞానంలో ఉంచుతున్నాయి. పర్యవసానం దేహాత్మాభిమానం - దేహమే ఆత్మ అనే తప్పుడు అభిప్రాయం దాని పర్యవసానం దేహం స్థాయిలోనే ఉండి, దేహాన్ని సుఖంగా ఉంచడం కంటే వేరే ధ్యేయం లేకుండా ఉండడం. ఉన్నత ఆదర్శాల నుంచి, అధ్యాత్మికత నుంచి ఈ కోశాలు మనల్ని దూరం చేస్తున్నాయని తాత్పర్యం. పశు పక్ష్యాదులకు కూడా ఆత్మ, పంచకోశాలు మానవుడిలో వలెనే ఉన్నాయని వేదాంతం చెప్పింది.
ప్రాణమయ కోశం అన్నమయ కోశానికి ఆత్మ; అలాగే, మనోమయ కోశం ప్రాణమయ కోశానికి ఆత్మ. మొదట శరీరమే ఆత్మ అనుకుంటాం. తర్వాత ప్రాణశక్తే ఆత్మ అనుకుంటాం. ఆ పిమ్మట మనస్సే ఆత్మ అనుకుంటాం. దృష్టిలో లోపలి కోశం పై కోశానికి ఆత్మ అని - ఒకదానికంటే ఒకటి -సూక్ష్మమైందని సూచన.
‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో, ‘వేదాంత పరిభాష’ నుంచి..
- కళానిధి సత్యనారాయణ మూర్తి