calender_icon.png 26 November, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1,435 కోట్లతో పాన్ వ్యవస్థ ఆధునీకరణ

26-11-2024 02:07:25 AM

పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

క్యూఆర్ కోడ్లతో కొత్త పాన్‌కార్డుల ముద్రణ

సేంద్రియ వ్యవసాయానికి రూ.2,481 కోట్లు

సబ్‌స్క్రిప్షన్ పథకానికి రూ.6 వేల కోట్లు

క్యాబినెట్ నిర్ణయాలను 

వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్‌కార్డు ఆధునీకరణకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాన్ 2.0 ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. భేటీ అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పాన్ కార్డు 2.0తో డిజిటల్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుత పన్ను చెల్లింపుదారుల పాన్‌లో ఎలాంటి మార్పు ఉండదని, కొత్త పాన్ కార్డులను క్యూఆర్ కోడ్‌తో ముద్రించనున్నట్లు తెలిపారు. కాగిత రహిత, ఆన్‌లైన్ విధానంలో ఫిర్యాదు వ్యవస్థపై దృష్టి పెట్టనున్నారు. ఇందుకోసం ఏకీకృత పోర్టల్‌ను తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,435 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. అంతేకాకుండా వ్యాపారుల కోసం పాన్, టాన్ అనుసంధానిస్తామని, ఇప్పటివరకు 78 కోట్ల పాన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. 

మరిన్ని నిర్ణయాలు

* అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే ఈ పథకానికి రూ.2,750 కోట్లు కేటాయించింది. 

* వన్ నేషన్ సబ్‌స్క్రిప్షన్ పథకానికి ఆమోదం లభించింది. ఇందుకోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల జర్నల్స్, పరిశోధనా పత్రాలు అందుబాటులో ఉంచనున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. 

* అరుణాచల్ ప్రదేశ్‌లో సౌరవిద్యుత్ కేంద్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

* సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు పాటు నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్‌కు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,481 కోట్లు కేటాయించారు. 

* కనెక్టివిటీ పెంచడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించేందుకు రూ.7,927 కోట్ల వ్యయంతో భారత రైల్వేలకు చెందిన మూడు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.