calender_icon.png 23 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాన్ ఇండియన్ సినిమా.. కేరాఫ్ టాలీవుడ్

22-12-2024 12:50:16 AM

చాలా మంది పాన్ ఇండియన్ సినిమా చేయడం సులభమే అనుకుంటారు. రూ.100 కోట్ల బడ్జెట్ ఉంటే సరిపోతుంది.. పాన్ ఇండియా సినిమా ఈజీగా చేసేయొచ్చు అని భావిస్తుంటారు. కావొచ్చు కానీ, ఆ సినిమాను అందరికీ నచ్చేలా చేయడంలోనే ఉంటుంది అసలైన కళ. మరి ఆ ఆర్ట్‌లో ఆరితేరింది ఒక్క దక్షిణాది దర్శకులేనా..? ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియన్ విజయాలు అందుకునే ట్రిక్ టాలీవుడ్ డైరెక్టర్లకే తెలుసా..? అంటే ఔనని చెప్పక తప్పని పరిస్థితి.  

పాన్ ఇండియన్ సినిమా అంటే కేరాఫ్ సౌత్ సినిమాగా మారిపోయిందిప్పుడు. ఇంకా అంటే కేరాఫ్ తెలుగు సినిమా అని చెప్పాలేమో! ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవడంలో టాలీవుడ్ దర్శకులదే పైచేయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నది తెలుగు సినిమా మాత్రమే. 2015, జులై 10న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ విడుదలైంది. తెలుగు పరిశ్రమకు పొరుగున ఉన్న తమిళ ఇండస్ట్రీకి కూడా చేరని రోజుల్లో ఏకంగా బాలీవుడ్‌కు తీసుకెళ్లి అక్కడి ప్రేక్షకు లతో చప్పట్టు కొట్టించిన ఘనత రాజమౌళిదే. ఆ తర్వాత ‘బాహుబలి2’తో బాలీవుడ్‌లో తనదైన స్థానాన్ని ఏర్పర్చుకున్నారు దర్శక ధీరుడు. ఇక ఆ విజయపరంపర ‘కేజీఎఫ్’తో కొనసాగింది. ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళి వేసిన బాటలో నడిచారు. బాలీవుడ్‌లో ‘కేజీఎఫ్’ సిరీస్ హవా కొనసాగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో మరోసారి ఉత్తరాది ప్రేక్షకులతో ఈలలు వేయించారు రాజమౌళి.

ఇక ‘కాంతారా’తో రిషబ్‌శెట్టి.. ‘కార్తికేయ2’తో చందు మొండేటి సైతం హిందీ ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రభాస్ అయితే ‘సాహో’, ‘కల్కి’ చిత్రాలతో పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబో చిత్రం ‘పుష్ప2’ బాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. దీన్నిబట్టి పాన్ ఇండియన్ సినిమాల్లో తెలుగు దర్శకులకు ఉన్న సక్సెస్ రేట్ ఇంకెవరికీ లేదని తెలుస్తోంది. తమిళం నుంచి ‘కంగువ’, ‘తంగలాన్’, ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి సినిమాలు వచ్చినా పాన్ ఇండియన్ కాలేకపోయాయి. ఉన్నంతలో కన్నడ కొంచెం నయం అనిపించింది. ఈ లెక్కన.. పాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నది తెలుగు పరిశ్రమే అనేది స్పష్టమవుతోంది.