- సర్వేనంబర్ 727పై అక్రమార్కుల కన్ను
- సుమారు 15 ఎకరాలు అన్యాక్రాంతం
- అక్రమంగా వెంచర్లు.. పుట్టగొడుగుల్లా కట్టడాలు
- పట్టించుకోని మున్సిపల్, రెవెన్యూ శాఖలు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 15 (విజయక్రాంతి): ‘కంచే.. చేను మేసిందా..’ అన్న చందంగా భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములను యం త్రాంగం గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులకు కట్టబెడుతున్నది. ఆయా భూముల్లో పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు, ఆ ప్లాట్లకు చకాచకా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.
ఇబ్బడి ముబ్బడిగా కట్టడాలు వెలుస్తున్నా యి. ఇప్పటికు సుమారు 15 ఎకరాల ప్రభు త్వ భూమి అక్రమార్కుల చేతిలోకి వెళ్లినట్లు ఓ అంచనా. వెంగళరావు కాలనీ, ప్రశాంతి కాలనీల పరిధిలో అక్రమణల పర్వం జోరు గా ఉన్నట్లు సమాచారం. అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో అక్రమా ర్కులు భూములను కబ్జా చేస్తున్నారనే ప్రచా రం పట్టణంలో సాగుతున్నది.
నిషేధిత ఆక్రమణలు..
పాల్వంచ పరిధిలోని 727 సర్వే నెంబర్ 727/ 24/1 భూమిని అధికారులు నిషేధిత (ప్రొహిబిటెడ్) భూమిగా గుర్తించారు. అంటే ఆ భూమిని అమ్మడం లేదా కొనడం నిషేధమని అర్థం. కానీ, భూమిని కబ్జా చేసిన అక్ర మార్కులు అక్కడ వెంచర్లు వేశారు. భూములను అమ్మి రిజిస్ట్రేషన్లు సైతం చేయించి డబ్బు దండుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులతో పాటు సీఎం పేషీకి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
రెండు వర్గాల మధ్య వివాదం..
సర్వే నెం 727లో కాంపెల్లి జనార్దన్ అనే వ్యక్తి 727/24లో 2.17 ఎకరాల అసైన్‌మెం ట్ పట్టా భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఆయన పక్కన ఉన్న కాలువను కబ్జా చేసిం మొత్తం 4 ఎకరాలను డిజిటల్ పహాణీలో నమోదు చేయించుకున్నట్లు సమాచారం. దీనిపై సమాచార హక్కు ద్వారా ఓ వ్యక్తి వివరాలు కోరాడు.
దీంతో ఆ సర్వే నంబర్ లో కేవలం 2.17 ఎకరాలు భూమి మాత్రమే ఉందని అధికారులు సమాధానం ఇచ్చారు. కానీ, డిజిటల్ పహాణీ ఎక్కువ భూమి చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఇప్పటికీ ఆ భూమిలో అక్రమ వెంచర్లు వెలిశాయి. కొత్తగూడెం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాటికి దర్జాగా రిజిస్ట్రేషన్లు సైతం జరుగుతున్నాయి. అంతేకాదు.. ఈ భూమిపై రెండువర్గాల మధ్య వివాదం నెలకొన్నది.
రెండువైపులా భూమి కోసం కోర్టు ను సైతం ఆశ్రయించినట్లు తెలసింది. భూవివాదంపై స్పందించిన గత కలెక్టర్ ప్రియాంక ఆల సర్వే నంబర్ 727/24 పరిధిలోని ఐదెకరాల భూమిని స్వాధీనం చేసు కోవాలని పాల్వంచ తహసీల్దార్‌నే గతేడాది ఆదేశించింది. వెంటనే రెవెన్యూశాఖ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నది. దీనిలో కొంత భూమిని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించింది. మిగిలిన భూమిని కాపాడేందుకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు
ప్రభుత్వ భూమిలో సాగు..
పట్టణ పరిధిలోని సర్వే నెంబర్ 727/ 31/ఆ భూమిపై మరో వివాదం ఉంది. ఇక్కడ ఓ వ్యక్తి 3.10 ఎకరాల్లో సేద్యం చేస్తున్నాడు. ఆ భూమి ప్రభుత్వ భూమి అని, అక్రమంగా ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వారు సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ రైతు తాను ఓ మహిళ నుంచి 1.10 ఎకరాల భూమి కొన్నట్లు పత్రాలు సమర్పించాడు.
కానీ, రెవెన్యూ రికార్డుల్లో ఆ మహిళ పేరు లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. 1.10 ఎకరాలు పోను, మిగిలిన 2 ఎకరాల సంగతేంటని ఆసామి చెప్పకపోవడం కొసమె రుపు. రెవెన్యూ అధికారులు వెంటనే భూమిని వదిలేయాలని రైతుపై ఒత్తిడి తెచ్చారు. తర్వాత ఆసామి కోర్టును ఆశ్రయించాడు. అనేక వాయిదాల తర్వాత తీర్పు ఇచ్చే వరకు ఆ భూమిపై ‘స్టేటస్ జారీ అయింది. దీంతో రెవెన్యూ శాఖ ట్రెస్‌పాసింగ్‌పై అక్కడ బోర్డు ఏర్పాటు చేసింది.
మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు..
పాల్వంచ పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 727 భూమిపై నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టరేట్ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. సర్వే చేయాలని ఉత్తర్వులే లేవు. గతంలో వచ్చినట్లు కూడా నాకు తెలియ దు. అక్రమ వెంచర్లు, ప్రభుత్వ భూమి ఆక్రమణలపై మాకు ఎలాంటి ఫిర్యాదు లు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే స్పందిస్తాం.
వివేక్, తహసీల్దార్, పాల్వంచ