మరోచోట బాటిల్ క్యాప్ తయారీ యూనిట్
- రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ‘యూనిలీవర్’
- దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సులో తొలి ఒప్పందం ఇది..
- ‘స్కై రూట్’ కంపెనీతో రాష్ట్రప్రభుత్వ రెండో ఒప్పందం
- ‘మేఘా’ ఇంజినీరింగ్ కంపెనీతో 3 ఒప్పందాలు
- అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వేదికగా మంగళవారం తెలంగాణ ప్రభుత్వం.. మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కంపెనీ మూడు ఒప్పందాలు, యూనిలీవర్ కంపెనీతో ఒక ఒప్పందం, స్కై రూట్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. ఎంఈఐఎల్ కంపెనీ తెలంగాణలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ నెలకొల్పనున్నది.
ప్రాజెక్ట్‌కు రూ.11 వేల కోట్ల పెట్టుబడులో పెట్టనున్నది. నిర్మా ణ సమయంలో ప్రాజెక్ట్ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభమై న తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సైతం నిర్వహిస్తుంది.
అలాగే కంపెనీ తెలంగాణ ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025’ లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్రాజెక్టు నెలకొల్పనున్నది. ఒప్పందంలో భాగంగా 100 ఎంవీహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. అందుకు రూ.3 వేల కోట్లు వెచ్చించనున్నది. ఈ వ్యవస్థ ద్వారా రెండేండ్లలో వెయ్యి మందికి ప్రత్యక్ష్య ఉద్యోగాలు, 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుంది. మేఘా కంపెనీ పర్యాటక రం గంలోనూ పెట్టుబడులకు ముందుకొచ్చిం ది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అందుకు రూ.వేయి కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
యూనిలీవర్ కంపెనీ పెట్టుబడులు..
తెలంగాణలో రెండు తయారీ యూని ట్లు నెలకొల్పేందుకు యూనిలీవర్ కంపెనీ ముందుకొచ్చింది. కామారెడ్డిలో పామాయిల్ ఫ్యాక్టరీ, రీ ఫైనింగ్ యూనిట్, మరోచోట బాటిల్ క్యాప్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రెండోరోజు మంగళవారం తెలంగాణ రైజింగ్ బృందం కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపి సఫలమైంది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కామారెడడ్డిలో పామాయిల్ యూనిట్, మరోచోట బాటిల్ క్యాప్ యూనిట్ నెలకొల్పేం దుకు అవసరమైన స్థలాలను సమీకరించి కంపెనీకి అప్పగిస్తామని తెలిపారు. యూనిలీవర్ కంపెనీ ఉత్పత్తులు ఎక్కువగా సీసాల్లో అమ్ముడవుతున్నాయని, ప్రస్తుతం కంపెనీ బాటిల్ క్యాప్‌లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కంపెనీనే స్వయంగా బాటిల్ క్యాప్‌ల తయారీకి సిద్ధమైందని, దీనిలో భాగంగానే ఆ పరిశ్రమను తెలంగాణలో నెలకొల్పేం దుకు సిద్ధమైందని తెలిపారు. కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను హిందూస్థాన్ లీవర్ పేరిట కొనసాగిస్తున్నదన్నారు.
భేటీలో యూనిలీవర్ సీఈవో హీన్‌షూ మేకర్, కంపెనీ చీఫ్ సప్లు చైన్ ఆఫీసర్ విలియం ఉయిజెన్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎంవో ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.
బిజీ బిజీగా తెలంగాణ రైజింగ్ బృందం..
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నిర్వాహకులు ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ ’ అనే నినాదంతో సదస్సు నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా శాస్త్ర సాంకేతిక, అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతోనే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది.
సదస్సుకు ప్రపంచ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధుల తో పాటు ఆయా రంగాల సుమారు 3 వేల మందికిపైగా నిపుణులు, పారిశ్రామికవేత్తలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రప్ఱభుత్వం రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు తీసుకురాగా, ఈసారి అంతకంటే ఎక్కువ పెట్టుబడులు సాధించేందుకు తెలంగాణ రైజింగ్ బృందం కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా అనేక కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వేర్వేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తితో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాకాలకు ఎన్నో కంపెనీలు ఆకర్షితులవుతున్నాయి. మరోవైపు తెలంగాణ రైజింగ్ బృందం సైతం హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ అభివృద్ధి, ఏఐ అధారిత ఐటీ సేవల విస్తరణ, అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటే లక్ష్యంగా అనేక కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా ఉంటున్నది.
హైదరాబాద్‌లో ప్రైవేట్ రాకెట్ల తయారీ యూనిట్
హైదరాబాద్‌లో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ‘స్కు రూట్’ ఏరో స్పేస్ కంపెనీ ముందుకొచ్చింది. ఈమేరకు దావోస్ డబ్ల్యూఈఎఫ్ వేదికగా మంగళవారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పదం చేసుకున్నది. ఒప్పందం ప్రకా రం కంపెనీ రూ.500 కోట్ల పెట్టుబడితో యూనిట్ నెలకొల్పనున్నది. హైదరాబాద్‌కు చెందిన స్కు రూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం ఆనందాన్నిచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఒప్పందం అంతరిక్ష రంగంపై రాష్ట్రప్రభుత్వానికి ఉన్న వ్యూహాత్మక దృష్టిని ప్రపం చానికి చాటిచెపుతుందన్నారు. కంపెనీ కో ఫౌండర్ పవన్‌కుమార్ చందన మాట్లాడుతూ.. హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో తమ కంపెనీ భాగస్వామి కూడా కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. తెలంగాణ రైజింగ్ బృందం అనంతరం కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నేతృత్వంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.
కంపెనీల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ‘ఎజిలిటీ’ చైర్మన్ తారెక్ సుల్తాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధా న్యం ఇస్తున్నదని వెల్లడించారు.
ప్రధానం గా సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుపై తాము పెట్టుబడులు ఆశిస్తున్నామని తెలిపారు. మంత్రి అనంతరం కాలిఫోర్ని యాకు చెందిన ‘సేంబనోవా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’తో చర్చలు జరిపారు.