calender_icon.png 17 November, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పామాయిల్ సాగు దేశానికే మార్గదర్శకం

29-06-2024 01:57:35 AM

  • ఐదేళ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక

అశ్వారావుపేటలో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

అశ్వారావుపేట, జూన్ 28: దేశంలోనే మార్గదర్శకంగా ఉండేలా తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణ చేపడుతున్నామని, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 10 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికను రచిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని శుక్రవారం ఆయిల్ ఫెడ్ ఎండీ, డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ యాశ్మిన్ భాషా, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలసి సందర్శించారు. ఫ్యాక్టరీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న 25 మెగావాట్ల పవర్‌ప్లాంట్ పనులను పరిశీలించారు. జూలై నెలఖారులోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు.

అనంతరం విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. దేశంలో లక్షల టన్నుల పామాయిల్ అవసరం కాగా ప్రస్తుతం 3.96 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దేశంలో కేవలం 11 లక్షల ఎకరాల్లో మాత్రమే పండుతుండగా, తెలంగాణలోనే రెండు లక్షల ఎకరాలు ఉన్నదన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రతి రైతు పామాయిల్ సాగు చేపట్టాలని, భవిష్యత్తులోనూ పామాయిల్ పంటకు ఎటువంటి ఢోకా ఉండదని అన్నారు.  పామాయిల్  సాగును మరింత విస్తరింపజేసి దేశానికి తెలంగాణ హబ్‌గా ఉండేలా చేస్తామన్నారు. దీనికి ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు.

పామాయిల్ రైతులకు రాయితీపై మొక్కలు, ఎరువులు ఇస్తామని, పంటల రవాణ ఖర్చులు కూడా ప్రభుత్వమూ భరించేలా చూస్తామన్నారు. పామాయిల్ గెలలు టన్నుకు రూ.15 వేలు తగ్గకుండా ఉండేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్టు తమ్మల తెలిపారు. ధర నిర్ణయ విషయంలో కొత్తగూడెం జిల్లాలో ఉన్న రెండు ఫ్యాక్టరీల్లో ఒకటైనా అప్పారావుపేట ఫ్యాక్టరీ ఓఆర్‌ను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. రైతులకు లాభం చేకూరేలా అప్పారావుపేట ఫ్యాక్టరీ ఓఆర్‌ను బెంచ్ మార్క్‌గా తీసుకుని దేశంలో రేటును నిర్ణయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపారు. సత్తుపల్లి, వేంసూరు ప్రాంతంలో సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలోనూ మరో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు.

పామాయిల్ తోటల్లో గతంలో వేసిన విద్యుత్ తీగల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నందున తమ సొంత ఖర్చుతో లైన్లు మార్చుకునేలా వెసులుబాటు కల్పించాలని రైతులు కోరుతున్నారని, దీనిపై విద్యుత్ శాఖ మంత్రి ద్వారా అధికారులకు తగిన ఆదేశాలు ఇప్పించి, షిఫ్టింగ్ చార్జీలు లేకుండా చూస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. అశ్వారావుపేటలోని వెంకమ్మ చెరువుకు సీతారామ ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.

అశ్వారావుపేట హార్టికల్చర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తుమ్మల తెలిపారు. మంత్రి వెంట అయిల్ ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, డివిజనల్ మేనేజర్ బాలకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు, జిల్లా ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ ఉన్నారు.