calender_icon.png 23 September, 2024 | 2:49 PM

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గృహనిర్బంధం

23-09-2024 12:55:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రితో సహా రాష్ట్రంలోని అన్ని దవాఖానల అధ్వాన్న పరిస్థితిని అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని నియమించిందన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని, సర్కార్ దవాఖానల్లో పరిస్థితులను అధ్యయనం చేయకుండా నిర్బంధాలకు పాల్పడుతున్నదని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగా సోమవారం గాంధీ దవాఖానను సందర్శించాల్సి ఉన్న వైద్య కమిటీ సభ్యులతో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్భంధం చేశారు. పల్లా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని తెలిపారు.

ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ దవాఖానకు కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదని , సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరని పల్లా పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు.. అంటూ ప్రభుత్వం చేసిన అరెస్టులా తీరుపై పల్లా రాజేశ్వర్ రెడ్డి  తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వెళ్లేందుకు ప్రయాత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ నిజానిర్ధరణ కమిటీని వేసింది. ఈ ఇందులో భాగంగానే కమిటీ సభ్యులు గాంధీ దవాఖానలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు.