calender_icon.png 1 April, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్ షాతో పళనిస్వామి భేటీ

26-03-2025 11:57:19 PM

15 నిమిషాల పాటు ఏకాంత చర్చలు

బీజేపీ కూటమి పునరుద్ధరణపై చర్చ

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి మంగళవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరపడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ కూటమి పునరుద్ధరణపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే భేటీలో తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న అన్నామలై పాత్రను కొంతమేర తగ్గిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను అమిత్ షా ముందు పెట్టినట్లు సమాచారం. కూటమి పునరుద్ధరణలో భాగంగా పార్టీ నేతలు టీవీవీ దినకరన్, వీకే శశికళ, పన్నీర్ సెల్వం గురించి తనకు ఆందోళన లేదని పళనిస్వామి పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడడంతో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. దీంతో 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి పళనిస్వామి బీజేపీకి దూరంగా ఉన్నారు. సైద్ధాంతిక విబేదాలు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వ్యవహారాశైలి నచ్చక 2023లో బీజేపీతో అధికారికంగా తెగదెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. అయితే కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో కలిసి పోటీ చేయాలని అన్నాడీఎంకే భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కూటమి పునరుద్ధరణపై చర్చించేందుకే పళనిస్వామి హుటాహుటిన ఢిల్లీకి పయనమైనట్టు అన్నాడీఎంకే వర్గాలు చర్చించుకున్నాయి.