calender_icon.png 21 January, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు వర్సిటీలో సమస్యల తిష్ట

13-07-2024 01:38:00 AM

వసతిగృహంలో భోజనం రోజుకో తీరు 

బాలికల వసతిగృహం సరిపోక 

మహిళా సమాఖ్య భవనంలో ఆశ్రయం 

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అత్యధికంగా విద్యాభ్యాసం చేస్తున్న పాలమూరు యూనివర్సిటీ(పీయూ)లో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. భోజనం నుంచి మరమ్మతుల విషయం వరకు పీయూ అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి వీడడం లేదు. విద్యార్థులకు కనీస సదుపాయాలను కల్పించడంలో అధికారులు విఫలం కావడం వల్ల విద్యార్థులు సమస్యలతోనే చదువులు కొనసాగిస్తున్నరు. 

మహబూబ్‌నగర్, జూలై 12 (విజయక్రాంతి): యూనివర్సిటీలో మహిళ లకు ప్రత్యేక వసతి గృహం ఉంది. కాగా వర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కోర్సుల సంఖ్యతోపాటు విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టు వసతిగృహాల సంఖ్య మాత్రం పెరగడం లేదు. దీంతో పీయూకు సమీపంలో మరో ప్రభుత్వ భవనం ఉండడంతో కాంపౌడ్ వాల్ పగలగొట్టి అందులో వసతి కల్పించారు. అందులో ఉండేవారు ఈ కూలగొట్టిన గోడల మధ్య నుంచి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా ఒకే గదిలో దాదాపు 8 మంది ఉండాల్సి వస్తోంది. చిన్న గదుల్లో ఎక్కువ మందిని కుక్కటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే మహిళలకు ఓ భవనం ఏర్పాటు చేశారు. ఆ నూతన భవనం అందుబాటులోకి వస్తే వారికి కొంత మేలు జరిగే అవకాశముంది. 

రోజుకో తీరు భోజనం 

హాస్టల్‌లో రోజుకో తీరులో భోజనం ఉంటుందని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం బాగలేదని ఫిర్యాదు చేస్తే ఓ రోజు మంచిగా చేసి తర్వాత నుంచి యథావిధిగా ఉంటుందని, ఫలితంగా దాన్ని తినలేకపోతున్నామని చెబుతున్నారు. కూరగాయాలు ఎప్పుడోసారి బాగుంటాయని తెలుపుతున్నారు. బాగాలేని రోజుల్లో ఉపవాసమే ఉంటున్నట్లు విద్యార్థినులు బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే వర్షం కురిసిందంటే హాస్టళ్లలోని పగిలిన కిటికీ అద్దాల నుంచి వర్షపు నీరు గదుల్లోకి చేరుతుంది. చలి కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. 

హాస్టళ్ల తీరు ఇదేనా?

విద్యార్థినులకు గైనకాలజిస్టు రెగ్యులర్‌గా అందుబాటు ఉండాలి. ఇక్కడ ఆ నిబంధనలు అసలు పట్టవు. కేవలం అప్పుడప్పుడు వస్తున్న వైద్య సిబ్బంది అవసరం ఉంటే బయటకు మందులు రాస్తున్నారు. వర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్లు కొరత కూడా ఉంది. పీజీ, ఎంఫీల్, పీహెచ్‌డీ కోర్సులకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పీహెచ్‌డీ చేసే వారికి వసతి గృహాలు అందుబాటులో లేవు. వర్సిటీ 2008లో ప్రారంభం కాగా ఇప్పటివరకు రీసెర్చ్‌కు సంబంధించిన భవనం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ కోర్సులకు చెందిన విద్యార్థులను ఒకే హాస్టల్ గదిలో ఉంచుతున్నారు. పీజీకి సంబంధించిన వసతి గృహంలోనే ఎంఏ (తెలుగు), ఎంసీఏ చదువుతున్న విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థుల వసతి గృహాలలో దాదాపు 400 మంది ఉన్నారు.  కనీసం రూంకు ఒక టేబుల్, నాలుగు కుర్చీలు ఉండాలి. కానీ వారికి నిద్రపోయేందుకు బెడ్లు కూడా సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.