calender_icon.png 18 November, 2024 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు వంటలక్కలు

02-11-2024 12:00:00 AM

పాలమూరు జిల్లా అంటేనే వలసలకు పెట్టింది పేరు. ఉన్న ఊళ్లో పనిలేక పొట్టకూటి కోసం వలసవెళ్లే ఆడబిడ్డలు ఎంతోమంది. కానీ ఆసక్తి, తపన ఉండాలేకానీ.. కొద్దిపాటి వనరులతో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడదే చేస్తున్నారు పాలమూరు మహిళలు. తమకు  తెలిసిన పనితోనే సొంతంగా ఉపాధి పొందుతున్నారు. సోలార్ పవర్ ద్వారా రకరకాల పొడులు తయారుచేస్తూ స్వశక్తితో ఎదుగుతూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. 

పాలమూరులో చాలా చోట్ల పంటలు పండక, సరైన పని దొరక్క పొట్టకూటి కోసం ముంబై, భాగ్యనగరాలకు వలస వెళ్లేవారు అధికం. పంటలు పండించినా సరైన గిట్టుబాటు ధర అందక, రవాణా ఖర్చులు భరించలేక పండించిన పంట కూడా పారబోసే పరిస్థితి.

ఇలాంటి పరిస్థితిని అధిగమించి తక్కువ ధరకు దొరికిన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను సోలార్ పవర్ ద్వారా ఎండబెట్టి,  తీరొక్క వంటలను (పొడులు) పరిచయం చేస్తున్నారు. పాలమూరు వంటలక్కలు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా వేదికలపై మన్నలను పొందుతున్నారు. వారితోపాటు మరికొందరికి పని కల్పించేలా స్వశక్తితో ఎదుగుతున్నారు. 

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన మహిళలు డీఆర్డీఓ పర్యవేక్షణలో పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రూపుగా ఏర్పడి పనిచేసుకుంటున్నారు. ‘గ్రామీణ సోలార్ ఫుడ్’ పేరుతో ఆకుకూరలు, కూరగాయలు, మునగ, కరివేపాకు, మామిడి, సపోట వంటి పండ్లను సోలార్ సహయంతో తయారుచేస్తున్నారు.

వాటిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు.. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, విద్యార్థుల్లో రక్తహీనత నుంచి బయటపడేలా బెల్లం పల్లీ పట్టీలు, నువ్వుల ఉండలు లాంటివి తయారుచేస్తున్నారు.

అవన్నీ పూర్తిగా ఆరోగ్యకరమైనవి కావడంతో వీరు తయారుచేసిన వంటలకు తక్కువకాలంలోనే మంచి పేరొచ్చింది. ప్రభుత్వం ప్రతినెల కొంత నగుదును సాయం చేస్తుండగా... ప్రతిఒక్కరూ రెండు వేల చొప్పున పెట్టుబడి పెట్టి విభిన్న రుచులతో ఉపాధి పొందుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా..

వంట అభిరుచి కలిగిన 15 మంది మహిళలు గ్రూపుగా ఏర్పడ్డారు. నిష్ణాతులైన చెఫ్‌లతో వింతైన వంటకాలపై శిక్షణ పొందారు. ఇందుకోసం ప్రత్యేకంగా 15 రోజులపాట శిక్షణ తీసుకున్నారు. వివిధ రకాల వంటల తయారీ విధానం నేర్చుకున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను కొనుగోలు చేస్తారు.

వాటిని చిన్నగా కత్తిరించి సోలార్ ద్వారా ఎండబెట్టి వాటిని పౌడరుగా మార్చి నిల్వ చేస్తారు. దీంతోపాటు లడ్డూల తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా స్టాళ్లను ఏర్పాటుచేసి నోరూరించే వంటలను అమ్మకానికి పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన సోలార్ ఫుడ్ స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. 

-- బొడ్డుపల్లి మల్లయ్య, నాగర్‌కర్నూల్.

సొంతంగా తయారుచేస్తం

ఒకప్పుడు దినసరి కూలీగా పనిచేస్తూ ఇ బ్బందులు పడ్డాను. ఇప్పుడు సొంతంగా లడ్డులూ, వివిధ వంట లు తయారుచేయడం నేర్చుకున్నా. ప్రభుత్వ సహకారంతో పలు ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటుచేసి ఉపాధి పొందుతున్నాం. మా వంటలకు మంచి పేరొచ్చింది.

 కృష్ణమ్మ, పెద్దకొత్తపల్లి 

అన్నీ ఆరోగ్యకరమైనవే!

మేం తయారు చే సిన లడ్డూలు, సోలార్ ఫుడ్ ఆదరణ లభిస్తోంది. వీటిని వివిధ జిల్లాలోని ప్రదర్శనకు ఉంచుతున్నాం. మేం తయారుచేసే ఫుడ్ గర్భవతులుకు, బాలింతలకు ఎంతోమేలు చేస్తున్నాయి. కాబట్టి మా వంటలకు మంచి ఆదరణ ఉంది. మాతో పాటు ఎంతోమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.

విజయమ్మ, మహిళా సంఘం నాయకురాలు