calender_icon.png 23 October, 2024 | 11:55 AM

పాలమాకుల కేజీబీవీ సిబ్బందిని బదిలీ చేస్తాం

02-09-2024 02:43:26 AM

  1. కస్తూర్బా పాఠశాలలను బలోపేతం చేస్తాం
  2. గత పాలకుల పొరపాట్లతోనే ఇబ్బందులు
  3. బీఆర్‌ఎస్ నేతల విమర్శలు హాస్యాస్పదం
  4. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

రాజేంద్రనగర్, సెప్టెంబర్1: శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా పాఠశాల సిబ్బందిని మొత్తం ఇక్కడి నుంచి బదిలీ చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆదివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి ఆదివారం పాఠశాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలతోపాటు ఇతర పాఠశాలలు, హాస్టళ్లను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు.

బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా సమస్యను పెద్దది చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కస్తూర్బా పాఠశాలలను ప్రవేశపెట్టారని, వాటిని బలోపేతం చేసేందుకు వసతుల కల్పనకు ఎలాం టి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆస్పత్రుల్లో రోగులను ఎలుకలు కొరుక్కుతిన్నాయని మండిపడ్డా రు. వారి విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎవరైనా పాలమాకుల కస్తూర్బా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీచర్ల మధ్య సమన్వయ లోపంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..

 విద్యార్థులతో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అన్నంలో, సాంబారులో పురుగులు వస్తున్నాయని, తమతో టీచర్లు వెట్టి చాకిరీ చేయిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. అదేవిధంగా పాఠశాలలో నెలకొన్న సమస్యను వారు మంత్రికి ఏకరువు పెట్టారు. తక్షణమే సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి సూచించారు. ఇక్కడి సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు.

సీఎం సమీక్ష నిర్వహిస్తా రని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోందన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్ శశాంకను మంత్రి ఆదేశించారు. నెలలో నాలుగైదు సార్లు ఉన్నతాధికారులు కేజీబీవీల్లో పర్యటించాలని సూ చించారు. పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొన్నారు.