calender_icon.png 5 November, 2024 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలబుగ్గల బాలచంద్రుడు

04-11-2024 12:00:00 AM

ఇన్నాళ్ళకు 

ఆ ఇల్లు చంటి పిల్లాడు అయింది 

ఉంగా ఉంగా సంగీతం 

అలుగు దునుకుతున్నది 

అటూ ఇటూ ఊగుతున్న 

ఊయల 

వచ్చీ పోయే వారి మోచేతులు గిల్లుతూ 

కొంటెగా పలుకరిస్తున్నది 

ముక్కు కారుతున్న 

చిట్టి పొట్టి గౌనుల సీతాకోకచిలుకలు కొన్ని 

లాగులు జారుతున్న పూలచొక్కాలు కొన్ని 

నింగి చంద్రుడు నేలకు దిగినట్టు 

తమతో ఆటకు రమ్మని సైగలు చేస్తున్నయి 

ఇల్లంతా వెన్నెల అలుకుతూ 

అంబాడుతూ వాడుంటే 

గుమ్మం ముందు చాక్లెట్ ఆశ చూపి 

ఎత్తుకునే ప్రేమగల్ల ఎదురుచూపులు 

చిన్ని కృష్ణుడు పారాడుతున్నట్టు 

చప్పట్లు కొడుతూ వెన్నదొంగ మిత్రులు 

బన్ను లాంటి బుగ్గలు వొత్తి వొత్తి 

వాని బుంగమూతి ఏడుపు చూడాలని 

ఏడిపించి ఆడిపించాలని 

వాలుతున్న అల్లరి తూనీగలు 

పరమశివుడు పాపాయి అయినట్టు 

పాల కడలిపై శేష తల్పమున పవళించే 

విష్ణుమూర్తి 

బాలుడయ్యి అమ్మఒడిలో నడుం వాల్చి  

కమ్మగ తల్లిపాలు తాగుతూ 

ఓరగా నవ్వుతున్నట్టు 

చుట్టూ చేరిన పిల్లలు 

తోవ తప్పిన దేవగణము 

దరికిరాని వనాలకోసం 

తరలి వచ్చిన వసంతం 

ఇంట్లో చంటి పిల్లాడున్నాడంటే 

వీధిలోని పిల్లలంతా 

వచ్చీపోయే అతిథులు.

- గజ్జెల రామకృష్ణ, 

 8977412795