అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు చారిత్రాత్మకం..
ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చేపట్టిన కులగణన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంచుతూ బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ, ఫోరం నాయకులు జేరిపోతుల పరుశురాం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ... దేశంలో గత 90 ఏళ్లుగా మేధావులు, రాజకీయ నాయకులు, ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న సమగ్ర కులగణన తెలంగాణ రాష్ట్రంలో విజయవంతం కావడంలో తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాలు హామీల అమలులో సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు.
ఈ విషయం దేశంలోని వెనుకబడిన వర్గాలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదన్నారు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన చేసినా కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వ ఆదేశాల అమలు కాకపోవడం దేశంలోని మెజారిటీ వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద మైనార్టీ వర్గాలు తీవ్ర నిరాశకు గురైనారని తెలిపారు. రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ కులగణన విజయవంతం కావడం ఈ వర్గాలకు మిక్కిలి ఆనంద ఉత్సవాల్లో ముంచెత్తిందన్నారు. తెలంగాణ కులగణన ఇంటింటి సర్వే విజయం కాంగ్రెస్ పార్టీకి వెనుకబడిన వర్గాల నిబద్ధత అని పేర్కొన్నారు.