ఇల్లెందు (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలకు హర్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లిలో మంగళవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి వ్యక్తికి పథకాల అందేలా చూస్తామని, పేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మొదటి రోజు 1,2 నుండి 18, 20 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతుభరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. మార్చి చివరి వరకు అందరికీ అందుతాయని వివరించారు. ఈ సందర్బంగా టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్ జిల్లా నాయకుడు కోరం సురేందర్, ఇస్లావత్ రెడ్యా నాయక్, బానోత్ భద్రు, బోడ సరిత, రాచమళ్ళ నరసయ్య, పోశాలు, చందర్ సింగ్, మల్సూర్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.