12-02-2025 11:19:49 PM
మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక నేతలు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): మాదిగ, మాదిగ ఉపకులాలకు 9 శాతం రిజర్వేషన్‌లను కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని మాదిగ, మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక తెలిపింది. 40 ఏండ్ల సుదీర్ఘ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆకాంక్షను నెరవేర్చిన ఎస్సీ వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఉత్తం కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, దామోదరం రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డిల ప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఐక్యవేదిక చైర్మన్ మేడి పాపయ్య, వైస్ చైర్మన్‌లు జన్ను కనకరాజు, ఇటిక రాజు, మేరీ మాదిగలు మాట్లాడుతూ... అన్ని వర్గాల మద్దతుతోనే వర్గీకరణ సాధించుకున్నామని, ఇక ఐక్య పోరాటాలకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు.
రాజ్యాధికారంతో పాటు అసైన్డ్, లీడ్ క్యాబ్ భూములు, సబ్ ప్లాన్ ద్వారా స్వావలంబన సాధించి సమగ్ర అభివృద్ది వైపు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో అభివృద్ది సాధించడానికి ఆలోచనలు చేసి ఆచరణ రూపం దాల్చే విధంగా అడుగులు వేయాలన్నారు. తమ సోదరుల మాల, మాల ఉపకులాలను కలుపుకొని ముందుకు సాగుదామని, ఎస్సీల వర్గీకరణ ఉద్యమం ఏ కులానికి వ్యతిరేక ఉద్యమం కాదన్నారు. సామాజిక అసమానతలను తగ్గించి రిజర్వేషన్ ఫలాలను సరి సమానంగా పంచుకునే పోరాటంగా మాత్రమే చూడాలని అన్నారు. ఇప్పుడు చేసిన వర్గీకరణలో గ్రూపులోని కులాలను ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ అని వాదనలు మాని పెద్ద మనసుదతో వర్గీకరణను స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర సలహాదారులు కొండేటి మల్లన్న, ప్రొఫెసర్ మల్లేష్, విజయ్ కుమార్, కృపాకర్, గడ్డ యాదయ్య, నవీన్ రాజు, ప్రవీణ్, బైరి వెంకటేశం, మంగేష్, గుర్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.