calender_icon.png 26 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో 208 మంది పాకిస్థానీలు

26-04-2025 12:59:41 AM

  1. వివరాలు సేకరిస్తున్న ఎస్‌బీ అధికారులు
  2. 27 లోగా తెలంగాణ విడిచి వెళ్లాలని పాక్ పౌరులకు అల్టిమేటం
  3. ఆదేశాలు జారీ చేసిన డీజీపీ జితేందర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25(విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందని నిర్ధారించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27లోగా పాకిస్థానీయులు భారత్‌ను వీడాలని ఆదేశించింది. తాజాగా ఈ ప్రభావం హైదరాబాద్‌పైనా పడింది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి కావడంతో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పాకిస్థాన్ పౌరుల వివరాలను స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) అధికారులు సేకరించారు. విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో తమ వివరాలు నమోదు చేసుకుంటుండగా.. పాకిస్థాన్,బంగ్లా జాతీయులు మాత్రం పాతబస్తీ పురానీ హవేలీలో ప్రత్యేక విభాగంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రత్యేక విభాగం వద్ద లభించిన సమాచారం మేరకు నగరంలో 208 మంది పాకిస్థానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 156 మందికి లాంగ్‌టర్మ్, 13 మందికి షార్ట్‌టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు నిర్ధారించారు. కాగా ఈనెల 29 వరకే వాఘా సరిహద్దు తెరిచి ఉండే నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న పాక్ పౌరులు 27లోగా తెలంగాణ వీడాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ  జితేందర్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 

నగరంలో హైఅలర్ట్ 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరిన్ని దాడులు జరిగే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో గస్తీని ముమ్మరం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భారత్ సమ్మిట్ సహా మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు నగరానికి రానున్నారు. దీంతో నగరంలో పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరిస్తున్నారు.